
అమరావతి: కర్నూల్(Kurnool)లో వీధి కుక్కలను(Street Dogs) అతి కిరాతకంగా కర్రలతో బాది చంపేస్తున్నారని(Beaten to death) ఓ ఫిర్యాదు పోలీసులకు అందింది. ఇది చట్ట వ్యతిరేకం అని, రూల్స్ ప్రకారం కుక్కల జనాభా నియంత్రణకు ఇతర పద్ధతులు ఉన్నాయని పిటిషనర్ పేర్కొన్నారు. అమానుషంగా కుక్కలను కొట్టి చంపడం సరికాదని తెలిపారు. ఓ ఎన్జీవో సంస్థ ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాదు, చంపేసింది మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది అయి ఉండొచ్చనే అనుమానాలనూ వ్యక్తం చేసింది.
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కుక్కల జనాభాను నియంత్రించడానికి యాంటీ బర్త్ కంట్రోల్(ABC) విధానం ఉంటుందని వెల్ఫేర్ ఆఫ్ యానిమల్స్ అండ్ లిబరేషన్ కర్నూల్ (వాక్) స్వచ్ఛంద సంస్థ పేర్కొంది. అంటే.. కుక్కలకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసి అవే ప్రదేశాలలో వదలాలని ప్రభుత్వ ఆదేశాలు చెబుతున్నాయని తెలిపింది. కానీ, ఈ నిబంధనలేవీ పట్టించుకోకుండా కొందరు మున్సిపల్ సిబ్బంది లేదా.. గుర్తు తెలియని ఇతరులు కుక్కలతో అతి కిరాతకంగా వ్యవహరించారని ఆరోపించింది. కర్రలతో కొట్టి కొట్టి.. ప్రాణాలు తీస్తున్నారని, అందుకు సంబంధించిన కొన్ని వీడియో ఆధారాలు తమ వద్ద ఉన్నాయని వివరించింది. ఆ కుక్కలను కర్నూల్ మున్సిపల్ కార్పొరేషన్ వెహికిల్‌లో చుట్టూ సంచులతో పరదాలు కట్టి తీసుకెళ్లారని ఆరోపణలు చేసింది.
ఇలా మూగ జీవాలను కొట్టి చంపడం తప్పు అని ఆ స్వచ్ఛంద సంస్థ పేర్కొంది. కుక్కలను అలా కొట్టి చంపిన వారికి ఐపీసీ 428, 429 సెక్షన్‌ల ప్రకారం తీవ్రమైన నేరంగా పరిగణిస్తారని తెలిపింది. ఈ సెక్షన్‌ల కింద దోషులకు రెండు సంవత్సరాల జైలు శిక్ష పడుతుందని హెచ్చరించింది. పోలీసు స్టేషన్‌లో ఈ క్రూరమైన చర్యను వ్యతిరేకిస్తూ ఫిర్యాదు చేశామని పేర్కొంది. రాజ్యాంగంలో ఆర్టికల్ 51ఏ ప్రకారం జంతువుల పట్ల దయ కలిగి ఉండటం భారత పౌరులుగా అందరి బాధ్యత అని తెలిపింది.
ఈ నెల 10వ తేదీన మున్సిపల్ సిబ్బంది లేదా ఇతరులు కుక్కలను దారుణంగా చంపేసిన ఘటన చోటుచేసుకుందని ఎన్‌జీవో వాక్ తెలిపింది. ఆ రోజు మధ్యాహ్నం సుమారు 12 గంటల ప్రాంతంలో కుక్కలను కొట్టి చంపారని ఆరోపించింది. వారు సుమారు 50 కుక్కలను పట్టుకున్నారని, చట్టానికి వ్యతిరేకంగా వాటిని కొట్టి చంపేశారని తెలిపింది. ఆ కుక్కలను పడుతున్నవారి సంభాషణ ద్వారా మరికొన్ని వాహనాలు కుక్కల కోసం సిటీలో తిరుగుతున్నట్టు అర్థం అవుతున్నదని వివరించింది. మూడు రోజులు ఈ తతంగం జరుగుతున్నట్టు తెలిపింది.
ఇదిలా ఉండగా, మధ్యప్రదేశ్‌లో కుక్కపై నుంచి వాహనం వెళ్లినందుకు బెదిరింపులు రావడంతో ఉరేసుకుని మరణించాడు. రాజ్ కరణ్ విశ్వకర్మ అనే డ్రైవర్ తన ట్రక్‌పై పని నిమిత్తం వేగంగా వెళ్తున్నాడు. కానీ, అనుకోకుండా ఓ కుక్క పిల్ల ఆకస్మికంగా దారిపైకి వచ్చింది. ఆ కుక్క పిల్లలను డ్రైవర్ తప్పించలేకపోయాడు. దీంతో ఆ ట్రక్ టైర్లు కుక్క పిల్లపై నుంచి దూసుకెళ్లాయి. ఈ ఘటన కొందరిలో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. కుక్క పిల్ల మరణించినందుకు ఏకంగా ఆ డ్రైవర్‌నే చితక బాదాలనేంతగా వారిలో కోపాన్ని రగిలించింది. దీంతో చోటు, సందీప్ పటేల్ అనే ఇద్దరు వ్యక్తులు ఆ డ్రైవర్ రాజ్ కరణ్ విశ్వకర్మ ఇంటి ఆచూకీని వెతికి మరీ పట్టుకున్నారు. డ్రైవర్ ఇంటికి చోటు, సందీప్ పటేల్ వెళ్లి దాడి చేశారు. ఆ దాడి తర్వాత రాజ్ కరణ్ విశ్వకర్మ ఉరి తాడుకు వేళాడుతూ కనిపించాడని అదనపు ఎస్పీ శివ కుమార్ వర్మ తెలిపారు.