శృంగవరపు కోట అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

By Siva KodatiFirst Published Mar 29, 2024, 5:02 PM IST
Highlights

విజయనగరం, విశాఖ జిల్లాలకు సరిగ్గా సెంటర్‌లో వుండటంతో పాటు రెండు జిల్లాలను అనుసంధానం చేస్తుంది శృంగవరపు కోట. ఈ సెగ్మెంట్ పరిధిలో కొప్పుల వెలమ, తూర్పు కాపులు, కొండ దొరలు, బగతలు బలంగా వున్నారు. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు శృంగవరపు కోట నుంచి ప్రాతినిథ్యం వహించారు. శృంగవరపు కోటలో టీడీపీకి కొప్పుల వెలమలు తొలి నుంచి అండగా నిలుస్తూ వస్తున్నారు. తూర్పు కాపుల్లో వైసీపీని ఆదరణ వుంది.. అయితే రాజుల మద్ధతు ఎటు వైపు వుంటే వారే శృంగవరపు కోటలో గెలుస్తారు.  శృంగవరపు కోటలో వైసీపీ పట్టు నిలపాలని సీఎం వైఎస్ జగన్ కృతనిశ్చయంతో వున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకు మరోసారి టికెట్ కేటాయించారు. మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారిని టీడీపీ ఇన్‌ఛార్జిగా ప్రకటించడంతో గొంప కృష్ణ అసమ్మతి వ్యక్తం చేస్తున్నారు.

ఉమ్మడి విజయనగరం జిల్లాలో రాజకీయంగా ప్రాధాన్యత కలిగిన నియోజకవర్గాల్లో శృంగవరపు కోట ఒకటి. విజయనగరం, విశాఖ జిల్లాలకు సరిగ్గా సెంటర్‌లో వుండటంతో పాటు రెండు జిల్లాలను అనుసంధానం చేస్తుంది శృంగవరపు కోట. ఈ నియోజకవర్గం పరిధిలో శృంగవరపు కోట, లక్కవరపుకోట, కొత్తవలస, వేపాడ, జామి మండలాలున్నాయి. ఈ నియోజకవర్గం చాలాకాలం పాటు ఎస్టీ రిజర్వ్‌డ్‌గా వుంది. 2009లో నియోజకవర్గాల పునర్విభజన సందర్భంగా జనరల్ స్థానంగా మారింది. ఈ సెగ్మెంట్ పరిధిలో కొప్పుల వెలమ, తూర్పు కాపులు, కొండ దొరలు, బగతలు బలంగా వున్నారు. ముఖ్యంగా కొప్పుల వెలమలదే శృంగవరపు కోటలో ఆధిపత్యం. 

శృంగవరపు కోట అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 .. టీడీపీ కంచుకోట :

ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు శృంగవరపు కోట నుంచి ప్రాతినిథ్యం వహించారు. ఆయన కోసం చాగంటి సోమయాజులు రాజీనామా చేయగా.. ప్రకాశం పంతులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శృంగవరపు కోట తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని చెప్పవచ్చు. 1983లో ఆ పార్టీ ఆవిర్భావం తర్వాతి నుంచి టీడీపీ ఏడు సార్లు విజయం సాధించింది. డుక్కు లబుడు బారికి 4 సార్లు వరుసగా గెలిచారు. ఆ తర్వాత కోళ్ల లలిత కుమారి రెండు సార్లు విజయం సాధించారు.

శృంగవరపు కోటలో టీడీపీకి కొప్పుల వెలమలు తొలి నుంచి అండగా నిలుస్తూ వస్తున్నారు. తూర్పు కాపుల్లో వైసీపీని ఆదరణ వుంది.. అయితే ఓటర్ల సంఖ్యా పరంగా కొప్పుల వెలమలదే ఆధిపత్యం కారణంగా ఇరు పార్టీలు ఆ సామాజికవర్గానికి చెందినవారినే అభ్యర్ధులుగా ప్రకటిస్తోంది. అయితే రాజుల మద్ధతు ఎటు వైపు వుంటే వారే శృంగవరపు కోటలో గెలుస్తారు. 

ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 2,50,429 మంది. వీరిలో పురుషులు 1,22,036 మంది.. మహిళలు 1,28,362 మంది. టీడీపీ 7 సార్లు, కాంగ్రెస్ 5 సార్లు, సోషలిస్ట్ పార్టీ , ప్రజా సోషలిస్ట్ పార్టీ, ఇండిపెండెంట్, వైసీపీ ఒకసారి ఇక్కడ విజయం సాధించాయి. 2019లో వైసీపీ అభ్యర్ధి కడుబండి శ్రీనివాసరావుకు 91,451 ఓట్లు.. టీడీపీ అభ్యర్ధి కోళ్ల లలిత కుమారికి 80,086 ఓట్లు పోలయ్యాయి.  మొత్తంగా వైసీపీ 11,365 ఓట్ల మెజారిటీతో శృంగవరపు కోటలో తొలిసారి పాగా వేసింది. 

శృంగవరపు కోట శాసనసభ ఎన్నికల ఫలితాలు 2024  .. పట్టు నిలుపుకోవాలని వైసీపీ : 

2024 ఎన్నికల విషయానికి వస్తే .. శృంగవరపు కోటలో వైసీపీ పట్టు నిలపాలని సీఎం వైఎస్ జగన్ కృతనిశ్చయంతో వున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకు మరోసారి టికెట్ కేటాయించారు. టీడీపీ విషయానికి వస్తే.. ఇక్కడ అభ్యర్ధి ఎంపిక ఆ పార్టీకి తలనొప్పులు తెచ్చిపెట్టింది. తొలుత ఎన్ఆర్ఐ గొంప కృష్ణకు పార్టీ బాధ్యతలు అప్పగించడంతో ఆయన చురుగ్గా పనిచేసుకుంటూ పోయారు. అధిష్టానం నుంచి కూడా అండదండలు అందడంతో కేడర్ ఉత్సాహంగా పనిచేసింది. టికెట్ కూడా కృష్ణకే అని అంతా భావించారు. అయితే అనూహ్యంగా ఎన్నికలకు ముందు మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారిని ఇన్‌ఛార్జిగా ప్రకటించడంతో గొంప కృష్ణ అసమ్మతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన స్వతంత్ర అభ్యర్ధిగా బరిలో దిగుతారని ప్రచారం జరుగుతోంది. 

click me!