కరోనా విజృంభణ: కంటైన్మెంట్ జోన్‌గా శ్రీశైలం, భక్తుల దర్శనాల రద్దు

By Siva KodatiFirst Published Aug 9, 2020, 8:32 PM IST
Highlights

కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా మరో ఐదు రోజుల పాటు శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల దర్శనం నిలిపివేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కె.ఎస్.రామారావు తెలియజేశారు

కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా మరో ఐదు రోజుల పాటు శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల దర్శనం నిలిపివేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కె.ఎస్.రామారావు తెలియజేశారు.

ఇప్పటికే శ్రీశైలం మండలంలో 160 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో పాటు రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూస్తున్నాయి. మరోవైపు ఆలయ సిబ్బందిలో పలువురికి కరోనా సోకడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. 

శ్రీశైలంలో భక్తుల దర్శనాలను గత నెల 15 నుండి నిలిపివేసిన సంగతి తెలిసిందే. తాజాగా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మరో వారం రోజుల పాటు దర్శనాలు నిలుపుదల చేస్తూ తహశీల్దార్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు శ్రీశైలం క్షేత్రాన్ని కంటోన్మెంట్ జోన్‌గా సైతం ప్రకటించారు.

అయితే ఆలయంలో యధావిధిగా కైంకర్యాలు, ప్రత్యేక పూజలు, పరోక్ష సేవలు నిర్వహిస్తామని ఈవో వెల్లడించారు. అంతేకాకుండా శ్రీశైల దేవస్థాన ఉన్నతాధికారులు, తహశీల్దార్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు టెలికాన్ఫరెన్స్ ద్వారా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు.

click me!