పట్టు వీడని శ్రీలక్ష్మి: తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు బదిలీ

By telugu teamFirst Published Dec 12, 2020, 8:44 AM IST
Highlights

వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లాలని ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మి ప్రయత్నాలు సాగిస్తున్నారు. చివరకు శ్రీలక్ష్మి తన లక్ష్యాన్ని సాధించుకున్నారు.

అమరావతి: సీనియర్ ఐఎఎస్ అధికారి ఎర్రా శ్రీలక్ష్మి పట్టు వీడకుండా ప్రయత్నాలు చేసి చివరకు సాధించారు. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు రావాలనే ఆమె ప్రయత్నం ఫలించింది. దాన్ని ఆమె పట్టుబట్టి సాధించారు. డిప్యూటేషన్ మీద తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు బదిలీ చేయించుకోవాలని ముందు అనుకున్నారు. ఆ ప్రయత్నాలు ఫలించలేదు. దాంతో ఆమె తన కేడర్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మార్పించుకున్నారు. 

క్యాట్ ఆదేశాల మేరకు ఆమెను తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేసింది. శుక్రవారం ఆమె అమరావతిలోని జీఎడీలో రిపోర్టు కూడా చేశారు. వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాగానే డిప్యూటేషన్ మీద తెలంగాణ నుంచి ఆమె ఏపీకి రావాలని ప్రయత్నాలు సాగించారు. జగన్ కూడా అందుకు సుముఖత వ్యక్తం చేశారు.

కార్యదర్శి, ఆపై స్థాయి అధికారులను డిప్యుటేషన్ మీద ఇతర రాష్ట్రాలకు పంపించడం కుదరదని చెబుతూ శ్రీలక్ష్మి  డిప్యుటేషన్ కు కేంద్ర ప్రభుత్వం అంగీకరించలేదు. దీంతో తన కేడర్ ను మార్చాలని కోరుతూ శ్రీలక్ష్మి ఈ ఏడాది ఫిబ్రవరిలో క్యాట్ ను ఆశ్రయించారు. 

తమది స్వతహాగాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా అని అయితే తమ తండ్రి రైల్వే అధికారి కావడంతో వృత్తిరీత్యా తెలంగాణకు వెళ్లామని, రాష్ట్ర విభజన సమయంలో తన పోస్టల్ చిరునామా ఆధారంగా తెలంగాణ కేడర్ కు కేటాయించారని ఆమె క్యాట్ కు విన్నవించుకున్నారు. అందువల్ల తనను ఏపీ కేడర్ కు కేటాయించాలని కోరారు. దానికి క్యాట్ అంగీకరించింది. 

దాంతో తెలంగాణ ప్రభుత్వం శ్రీలక్ష్మిని రిలీవ్ చేసింది. 1998 బ్యాచ్ కు చెందిన శ్రీలక్ష్మి ఓబులాపురం గనుల కేసులో అరెస్టయిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆమెపై సస్పెన్షన్ వేటు పడింది. ఆ తర్వాత సస్పెన్షన్ ను ఎత్తివేశారు. అయినా ఆమెకు ప్రమోషన్ రాలేదు.

click me!