కంటైన్మెంట్ జోన్లో శ్రీకాళహస్తి...సేప్ జోన్ లోనే ఇందకీలాద్రి: మంత్రి వెల్లంపల్లి

By Arun Kumar PFirst Published Jun 6, 2020, 12:24 PM IST
Highlights

ఈనెల 8,9 తేదీల్లో అన్ని దేవాలయాల్లో దర్శనం కోసం ట్రయల్ రన్ చేపట్టనున్నట్లు మంత్రి వెల్లంపల్లి  శ్రీనివాస్ తెలిపారు. 

అమరావతి: ఈనెల 8,9 తేదీల్లో అన్ని దేవాలయాల్లో దర్శనం కోసం ట్రయల్ రన్ చేపట్టనున్నట్లు మంత్రి వెల్లంపల్లి  శ్రీనివాస్ తెలిపారు. దేవాలయాల్లో పనిచేసే సిబ్బంది, స్థానికులతో మొదట ట్రయల్ రన్ నిర్వహిస్తామని...10వ తేదీ నుంచి భక్తులకు దర్శనం కల్పిస్తామని వెల్లడించారు. 

విజయవాడ దుర్గగుడి కంటైన్మెంట్ జోన్ లో లేదని... కానీ శ్రీకాళహస్తి కంటైన్మెంట్ జోన్ లో ఉందన్నారు. భక్తులు ప్రతి ఒక్కరు ఆరోగ్య సేతు యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలని... ఖచ్చితంగా మాస్క్ ధరించి రావాలని సూచించారు. నియంత్రణ ప్రకారం దర్శనం కల్పించనున్నట్లు తెలిపారు. 

కరోనా నేపథ్యంలో భక్తులు ఎక్కువ మంది దర్శనాలకు రావొద్దని సూచించారు. స్లాట్ ప్రకారమే దర్శనం కల్పిస్తామని... ఆన్ లైన్ లో దర్శనం టికెట్స్ తీసుకోవాలన్నారు. పదేళ్ల లోపు పిల్లలు, వృద్దులు దర్శనాలకు రావొద్దని... కేశఖండన శాలలో పని చేసే వారికి మరింత ఆర్ధిక సహకారం అందిస్తామన్నారు.  రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో అంతరాలయ దర్శనాలు రద్దు చేసినట్లు దేవాదాయ మంత్రి వెల్లంపల్లి వెల్లడించారు. 

read more    8న విజయవాడ దుర్గమ్మ దర్శనమిచ్చేనా..? కలెక్టర్ ను క్లారిటీ కోరిన ఈవో

ఈ నెల 8వ తేదీ నుండి ప్రార్ధనా మందిరాలు  తెరుచుకోనున్న నేపథ్యంలో వచ్చే భక్తులకు కేంద్రం మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రార్ధనా మందిరాల్లోకి వచ్చేందుకు వెళ్లేందుకు భక్తులకు వేర్వేరు మార్గాలు ఉండాలని కేంద్రం సూచించింది. ఆలయంలోకి భక్తులు ప్రవేశించే మార్గంలో థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేయాలని కేంద్రం సూచించింది. అంతేకాదు భక్తులు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని కూడ కేంద్రం కోరింది.

ప్రార్ధనా మందిరాలకు వచ్చేవారిని విడతలవారీగా పంపాలని కోరింది. క్యూ లైన్లలో భక్తులకు భక్తులకు మధ్య 2 మీటర్ల దూరం పాటించాలని కేంద్రం సూచించింది.భక్తి గీతాలను ఆలపించవద్దని సూచించింది. భక్తిగీతాలు, పాటలు రికార్డు చేసిన వాటిని విన్పించాలని కోరింది. ప్రసాదం, తీర్థం ఇవ్వడం, పవిత్ర జలం చల్లొద్దని కూడ సూచించింది.

అన్న ప్రసాదం తయారు చేసే సమయంలోనూ, పంచే సమయంలో కూడ భౌతిక దూరాన్ని పాటించాలని కూడ కేంద్రం ఆదేశించింది. విగ్రహాలను, పవిత్ర గ్రంథాలను కూడ తాకకుండా చూడాలని సూచించింది. మతపరమైన సమావేశాలు, జనాలు గుంపులుగా వేడుకల నిర్వహణపై కూడ కేంద్రం నిషేధం విధించింది.

లాక్ డౌన్ నేపథ్యంలో ఈ ఏడాది మార్చి మూడో వారం నుండి ఆలయాల్లో భక్తుల ప్రవేశాన్ని నిషేధించారు. ఈ నెల 10వ తేదీ నుండి ప్రార్ధనా మందిరాల్లోకి పూర్తిస్థాయిలో భక్తులను అనుమతించే అవకాశం ఉంది.

click me!