టోల్ ఫీజు కోసం ఆలోచిస్తే ప్రాణాలే బలి... రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

By Arun Kumar PFirst Published May 19, 2020, 1:20 PM IST
Highlights

శ్రీకాకుళం జిల్లాలో తెల్లవారుజామున చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదం రెండు నిండు ప్రాణాలు బలితీసుకుంది. 

శ్రీకాకుళం జిల్లాలో ఇవాళ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పలాస నుండి బ్రాహ్మణతర్లకు తెల్లవారుజామున చేపలలోడుతో వెళుతున్నఆటోను ఎదురుగా వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ తో పాటు మరో చేపలవ్యాపారి మృతిచెందాడు. 

బ్రహ్మణతర్లకు చెందిన ధర్మాన జీవితేశ్వర్రావు(23) చేపల వ్యాపారి. వ్యాపారంలో భాగంగా ఇవాళ తెల్లవారుజామునే పలాసకు వెళ్లి చేపలను కొనుగోలు చేసిన అతడు ఓ ఆటోలో వాటిని గ్రామానికి తరలిస్తున్నాడు. ఈ క్రమంలో  చిన్నబాడం సమీపంలో పాత జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా ఆటోనే లారీ ఢీకొట్టింది. 

కొత్త జాతీయరహదారి పై టోల్ ప్లాజా కట్టాల్సి రావడంతో తప్పించుకునేందుకు చాలామంది లారీ  డ్రైవర్లు కాశిబుగ్గ పట్టణం మీదుగా పాత జాతీయ రహదారిపై వెళుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. తాజాగా జరిగిన ప్రమాదం కూడా ఇలాంటి లారీ వల్లే జరిగి వుంటుందని అనుమానిస్తున్నారు. 

లారీ మితిమీరిన వేగంతో ఎదురుగా వచ్చి ఢీకొట్టడంతో బ్రహ్మణతర్లకు చెందిన ఆటోడ్రైవర్ ఆళ్ల రవి(32), వ్యాపారి జీవితేశ్వర్రావు(23) అక్కడికక్కడే మృతిచెందారు.   ఆటో డ్రైవర్ రవికి  కొద్దీ రోజులు క్రితం వివాహం అయ్యింది.

అ దుర్ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. రెండు మృతదేహాలను పలాస ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం కొరకు తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు కాశిబుగ్గ పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం లారీ డ్రైవర్ పరారీలో వున్నట్లు పోలీసులు తెలిపారు. 
 

click me!