
ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నలుగురు రాజ్యసభ (Rajya Sabha) సభ్యుల పదవీకాలం ఈ ఏడాది జూన్ 21తో ముగియనుంది. రాజ్యసభ పదవీకాలం ముగియనున్న వారిలో విజయసాయిరెడ్డి (Vijayasai Reddy), సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్‌లు, సురేష్ ప్రభులు ఉన్నారు. వీరిలో విజయసాయి రెడ్డి వైసీపీది కాగా.. సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్‌లు టీడీపీ నుంచి గెలుపొంది ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు. ఇక, బీజేపీ నేత సురేష్ ప్రభు అప్పటి టీడీపీ - బీజేపీ పొత్తులో భాగంగా ఏపీ నుంచి రాజ్యసభకు వెళ్లారు. అయితే ఈ ఎన్నికలకు మార్చి నెలలో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అయితే ప్రస్తుతం ఖాళీ అవుతున్న నాలుగు స్థానాలు కూడా వైస్సార్‌సీపీ (YSRCP) ఖాతాలోకే వెళ్లనున్నాయి. దీంతో ఆ స్థానాలను వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ ఎవరికి కేటాయిస్తారనే చర్చ జరుగుతుంది. ఇందుకు కొద్ది సమయమే ఉండటంతో అశావహులు తమ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. మరోవైపు జగన్ గతంలో ఇచ్చిన హామీలను దృష్టిలో ఉంచుకుని రాజ్యసభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు.
వైసీపీ నుంచి విజయసాయి రెడ్డికి సీఎం జగన్ మరోసారి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే విజయసాయిరెడ్డికి సంబంధించి పలు రకాల వార్తలు ప్రచారంలోకి వచ్చినప్పటికీ.. ఆయనను మరోసారి రాజ్యసభకు పంపడం ఖరారైనట్టేనని వైసీపీ వర్గాలు నుంచి అందుతున్న సమాచారం. ఇక, మిగిలిన మూడు స్థానాల్లో.. రెండు తమ సొంత పార్టీ నేతలకు, మరోకటి కార్పొరేట్ దిగ్గజానికి ఇచ్చే ఆలోచనలో జగన్ ఉన్నట్టుగా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. రిలియన్స్ ఇండస్ట్రీ అధినేత ముఖేష్ అంబానీ సన్నిహితుడు పరిమళ్ నత్వానీని (Parimal Nathwani) ఏపీ నుంచి రాజ్యసభకు పంపినట్టుగానే.. ఈసారి నార్త్ ఇండియాకు చెందిన కార్పొరేట్ దిగ్గజాన్ని రాజ్యసభకు పంపే అవకాశం ఉందని తెలుస్తోంది.
పార్టీకి చెందిన ఇద్దరు నేతల విషయానికి వస్తే.. సీఎం జగన్ సామాజిక సమీకరణాలతో పాటుగా, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకోనున్నారు. ఈ క్రమంలోనే బీసీ కోటాలో నెల్లూరు జిల్లాకు చెందిన బీద మస్తాన్‌రావును, మరో స్థానం నుంచి గుంటూరు జిల్లాలో మూడేళ్ల నుంచి ఏ అవకాశమూ దక్కని సీనియర్ నేతను ఈసారి రాజ్యసభకు పంపే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. గుంటూరు జిల్లాకు చెందిన ఆ సీనియర్ నేతను గత వారం సీఎం జగన్ తన కార్యాలయానికి పిలిపించుకుని మాట్లాడినట్టుగా తెలుస్తోంది. మొత్తంగా నాలుగు స్థానాల్లో ఒక్కటి మాత్రం ఎస్సీ లేదా మైనారిటీ వర్గాలకు కేటాయిస్తారనే ప్రచారం వైసీపీ వర్గాల్లో సాగుతుంది. ఇక, సీఎం జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారో త్వరలోనే ఓ స్పష్టత రానుంది.