
రాష్ట్ర శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మహిళలను వాహనాలతో పోల్చారు. మహిళలు వంటింటికి మాత్రమే పరిమితమైతే వారిపై ఎటువంటి వేధింపులుండవని చెప్పటం ఆశ్చర్యంగా ఉంది. వాహనాలను కొని షెడ్లలో ఉంచితే వాటికి ఎటువంటి ప్రమాదాలు జరగవట. అదే బయట తిప్పటం మొదలుపెడితే మాత్రం ప్రమాదాలు తప్పవట. అదేవిధంగా మహిళలు కూడా వంటింటికి మాత్రమే పరిమితమైతే వారిపై వేధిపులుండవన్నారు. అదే ఉద్యోగాలు, వ్యాపారాల పేరుతో మహిళలు బయటతిరుగుతున్నారు కాబట్టే వేధింపులుంటున్నాయని స్పీకర్ పేర్కొనటం గమనార్హం. అంటే స్పీకర్ ఉద్దేశ్యంలో వాహనాలు, మహిళలు ఒకటేనా?
’మహిళా సాధికారత‘ పై అసెంబ్లీ ఆధ్వర్యంలో త్వరలో జరగనున్న అంతర్జాతీయ సదస్సుపై మీడియాతో మాట్లాడుతూ స్పీకర్ పై వ్యాఖ్యలు చేసారు. అయితే, తన ఉద్దశ్యంలో మహిళలు వంటింటికే పరిమితం కావాలని కాదంటూ సవరించుకున్నారు. అయితే, బయట తిరుగుతున్న మహిళలు ధైర్యంగా సమస్యలను ఎదుర్కొవాలని చెప్పారు. మహిళల రక్షణకు చట్టాలు చేసినంత మాత్రాన సరిపోదని కూడా అన్నారు.
స్పీకర్ చెప్పింది బాగానే ఉందికానీ, ఆయన జిల్లాలోనే బాపట్ల ఎంపిపి విజేతమ్మ , మాచర్ల మున్సిపాల్ ఛైర్ పర్సన్ శ్రీదేవి, జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ జానీమూన్ వేధింపులపై కొడెల ఎందుకు నోరు మెదపలేదో చెప్పాలి. ఎంఆర్ఓ వనజాక్షిపై సాక్షాత్తు తమ పార్టీ ఎంఎల్ఏ చింతమనేని ప్రభాకర్ దాడిచేసినా దిక్కులేదు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై అఘాయిత్యాలు బాగా పెరిగిపోయాయని స్వయంగా పోలీసు రికార్డులే చెబుతున్నాయి. మరి వాటి విషయంపైన కూడా కోడెల మాట్లాడితే బాగుంటుందేమో. అసెంబ్లీలోనే వైసీపీ ఎంఎల్ఏ రోజాను రెచ్చగొట్టి, చాలా అసహ్యంగా మాట్లాడినపుడు ఎన్నడూ వారిని స్పీకర్ వారించినట్లు కనబడలేదు. మరి ఆ విషయాలపైన కూడా స్పీకర్ ఆలోచించాలి.