
వచ్చే ఎన్నికల్లో అధికార టిడిపికి గట్టి ప్రత్యామ్నాయంగా ఎవరు నిలుస్తారనే విషయమై చర్చ జరుగుతోంది. మామూలుగా అయితే వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డే నిలుస్తారనటంలో ఎవరికీ అనుమానాల్లేవు. ఎందుకంటే, మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయినా ఇంట్లో కూర్చోలేదు. ఏదో ఓ సమస్యపై రాష్ట్రమంతా పర్యటిస్తూనే ఉన్నారు. చంద్రబాబునాయుడు విధానాలపై రాష్ట్రంలో ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. జగన్ కి ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా తన రాజకీయం తాను చేసుకుపోతూనే ఉన్నారు.
మొన్నటి ఎన్నికల్లో వైసీపీ తరపున 67 మంది ఎంఎల్ఏలు గెలిచారు. అధికారాన్ని కోల్పోయింది కూడా కేవలం 5 లక్షల ఓట్ల తేడాతోనే. చంద్రబాబుకు మద్దతుగా నరేంద్రమోడి, పవన్ కల్యాణ్, ఉచిత హామీలు నిలబడినా ఒంటరిగానే ఎదుర్కొన్నారు. ఫిరాయింపుల పేరుతో చంద్రబాబు 21 మంది ఎంఎల్ఏలను లాక్కున్నా జగన్ ఏమాత్రం తొణకలేదు. ఆయా నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయాలను చూసుకుంటున్నారు. ఫీజు రీ ఎంబర్స్ మెంట్, ఆరోగ్యశ్రీ పథకం, ఉచిత హామీల అమలు, రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, ప్రత్యేకహోదా లాంటి అంశాలపై పోరాటాలు చేస్తున్నారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో వైసీపీనే చంద్రబాబుకు ప్రత్యామ్నయమని అనిపించుకున్నారు.
అయితే, హటాత్తుగా పవన్ కల్యాణ్ బరిలోకి దూసుకువచ్చారు. మొన్నటి వరకూ ఇటు చంద్రబాబుతోను అటు మోడితోనూ సత్సంబంధధాలనే కలిగి ఉన్న పవన్ తాజాగా భాజపాతో దూరమైనట్లే కనబడుతోంది. ఇక, చంద్రబాబుతో సంబంధాలపైనే ఇంకా స్పష్టత రాలేదు. ఏపికి ప్రత్యేకహోదా ఇవ్వటం సాధ్యం కాదని కేంద్రమంత్రులు ఎప్పటి నుండో చెబుతూనే ఉన్నారు. అయితే, జల్లికట్టు ఉద్యమం తర్వాతే పవన్ ఒక్కసారిగా హోదాపై గళం పెంచారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయడుపై ధ్వజమెత్తుతున్న పవన్, నరేంద్రమోడి, చంద్రబాబు గురించి మాట్లాడటంలో మొహమాట పడుతున్నారు.
జగన్ పూర్తిస్ధాయి రాజకీయ నేత కాబట్టే నిత్యం జనాల్లోనే ఉంటున్నారు. పైగా రాష్ట్రమంతా గట్టి నేతలు, బలమైన క్యాడరుంది. కాబట్టి జగన్ ఎన్ని పోరాటాలైనా చేస్తారు. అదే పవన్ విషయం అలా కాదు. జనసేనకు రంగు, రుచి, రూపు అంతా పవన్ మాత్రమే. పైగా సినిమాల్లో బిజీ. పవన్ ది రెండు పడవల ప్రయాణం. కాబట్టి రోజూ జనాలకు అందుబాటులో ఉండాలంటే పవన్ కు సాధ్యం కాదు. అయినా ఓవైపు అభిమానులు, మరోవైపు సామాజిక వర్గంలో అపారమైన మద్దతుంది. దీని ఆధారంగా చంద్రబాబుకు ప్రత్యర్ధిగా మారుతారా అన్న విషయంలోనే కొన్ని అనుమానాలున్నాయి. ఈ నేపధ్యంలో ఇద్దరిలో చంద్రబాబుకు ప్రత్యామ్నాయంగా ప్రజలు ఎవరికి మద్దతుగా నిలబడతారో చూడాలి.