
‘సీతబాధ సీతది పీతబాధ పీతది’ అన్నట్లుంది సోము వీర్రాజు వ్యవహారం. సోము వీర్రాజంటే భాజపాలో సీనియర్ నేత. పైగా ఎంఎల్సీ కూడా. మరి ఆయనకేమిటి బాధలంటారా? చంద్రబాబునాయుడు ప్రభుత్వ రాష్ట్రంలోని తమ పార్టీ కార్యకర్తలను ఏమాత్రం పట్టించుకోవటం లేదట. తమ కార్యకర్తలకు ఇళ్ళు కేటాయించటం లేదని, సంక్షేమ పథకాలు అమలు చేయటం లేదని వాపోయారు. చివరకు కేంద్రం మంజూరు చేస్తున్న ఇళ్ళు కూడా తమ పార్టీ వాళ్ళకు ఇవ్వటం లేదట. పైగా వాటికి ఎన్టీఆర్ పేరు పెడుతున్నట్లు ఫిర్యాదు కూడా చేసారు.
ఇకనైనా ఇలాంటి విధానాలకు స్వస్తి పలకాలన్నారు. అంతేకాకుండా కేంద్రప్రభుత్వ పథకాల పోస్టర్లు, బ్యానర్లలో ఎక్కడ కూడా ప్రధానమంత్రి ఫొటోలు పెట్టటం లేదట. తెలంగాణాలో పెడుతున్నారుగానీ ఏపిలో ఎందుకు పెట్టటం లేదని ప్రశ్నించారు. రాజుగారి బాధలు చాలానే ఉన్నాయి గానీ వాటిని ఎవరు పట్టించుకోవాలి. అడగాల్సిన ఢిల్లీ నాయుడేమో చంద్రబాబు భజనలో ముణిగిపోయే. రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబుకేమో చంద్రబాబే ముఖ్యం. కాబట్టి ఆయనా అడగరు. మధ్యలో సోము వీర్రాజుకేమిటి బాధ.
అయినా వీర్రాజు ఎలా బాధపడుతున్నారో చంద్రబాబు కూడా అదే విధంగా బాదపడుతున్నారు కదా? కేంద్రం తనను ఏమాత్రం ఖాతరు చేయటం లేదని చంద్రబాబు కూడా చాలా కాలంగా మధనపడుతున్నారు. ప్రత్యేక హోదా ఇవ్వమని అడిగిన రోజుల్లో లెక్క చేయలేదు. పోనీ ప్రత్యేక ప్యాకేజికి చట్టబద్దత కల్పించమని నెలల తరబడి అడుగుతున్నా పట్టించుకోవటం లేదు. కేంద్రం వైఖరిపై తన రక్తం మరిగిపోతోందని గతంలోనే ఓసారి చంద్రబాబు చెప్పినా కేంద్రం ఏమాత్రం ఖాతరు చేయలేదు కదా? ఏం చేస్తారు.. మాట్లాడకుండా కూర్చోలేదా? అందుకే సీతబాధలు సీతవి పీతబాధలు పీతవన్నారు.