కేసీఆర్ తో అన్యోన్యత ఇప్పుడేమయ్యింది? నోరెత్తవేం?: జగన్ ను నిలదీసిన సోమిరెడ్డి

By Arun Kumar PFirst Published Jul 30, 2021, 6:49 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాాదంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని నిలదీశారు తెలుగుదేశం నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. 

మంగళగిరి: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు మనస్పర్థలు, వ్యక్తిగత కారణాలతో రాయలసీమ వాసులకు కృష్ణాజలాలపై ఉండే హక్కులను కాలరాస్తున్నారని మాజీ మంత్రి  సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.  గతంలో ఎంతో అన్యోన్యంగా వున్న కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి లు ఇప్పుడెందుకు ఇలా ఉంటున్నారో... కారణాలేమిటో తమకు తెలియడంలేదని సోమిరెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. 

''రాయలసీమ వాసులతో పాటు నెల్లూరువాసుల హక్కులకు భంగం కలిగించే అధికారం, హక్కు ఎవరికీ లేదు. తెలంగాణ ఇరిగేషన్ ఇంజనీరింగ్ చీఫ్ మురళీకృష్ణ, కృష్ణారివర్ మేనేజ్ మెంట్ (కేఆర్ఎంబీ) కి లేఖ రాశారు. దానిలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కు నీళ్లిచ్చేది లేదని, నీళ్లు కావాలంటే ఏపీ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చని, నీళ్లు వాడుకోవాలంటే ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలు, కేఆర్ఎంబీ కలిసికూర్చొని మాట్లాడుకున్నాకే నిర్ణయించాలని లేఖలో సదరు అధికారి చెప్పారు'' అని సోమిరెడ్డి వివరించారు. 

''శ్రీశైలానికి నేడు 5లక్షల40వేల క్యూసెక్కుల వరకు నీరొస్తోంది. వారం, పదిరోజుల్లో జూరాల, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు నిండిపోతాయి. తరువాత వరద నీరంతా ప్రకాశం బ్యారేజ్ నుంచి సముద్రంలోకి వెళ్లిపోతాయి'' అని తెలిపారు. 

read more  ఆ వైసిపి ఎమ్మెల్యే ఆంధ్రా డేరా బాబా..: పంచుమర్తి అనురాధ సంచలనం

''శ్రీశైలం ఎడమ కాలువలో విద్యుదుత్పత్తి చేయకూడదు. నిబంధనలకు విరుద్ధంగా 810 అడుగులకు నీటిమట్టం ఉన్నా కూడా తెలంగాణ విద్యుదుత్పత్తి చేసింది. నీటిని వృథాగా సముద్రంపాలు చేసింది. ఇప్పుడేమో అన్నిప్రాజెక్టులు నిండిపోయాక కూడా నీరంతా వృదాగా పోతున్నాకూడా రాయలసీమవాసులు నీరు వాడుకోకూడదని చెప్పడమేంటి? వారు తాగునీరు, సాగునీరు లేక చనిపోవాలని కోరుకుంటున్నారా? తోటి తెలుగు ప్రజలు ...నిన్నటి వరకు అందరం కలిసే ఉన్నాము. ఆ విషయం మర్చిపోయి తెలంగాణ నీటిపారుదల శాఖాధికారి కేఆర్ఎంబీకి అలా లేఖ రాయడం ఏమిటి?'' అని మండిపడ్డారు. 

''దాదాపు 5.50లక్షల క్యూసెక్కుల వరకు వృథాగా సముద్రం పాలవుతున్నా చూస్తూ ఉంటారు కానీ పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు నీటిని మళ్లించడాన్ని మాత్రం ఒప్పుకోరా? ఈరోజు ఉదయానికి శ్రీశైలానికి 5లక్షల30వేల క్యూసెక్కుల నీరు వస్తుంటే 4లక్షల30వేల క్యూసెక్కుల వరకు దిగువకు వదులుతున్నారు. 312టీఎంసీల నిల్వ సామర్థ్యానికి 205టీఎంసీల వరకు ఉన్నాయి. రోజుకి 40నుంచి50 టీఎంసీల నీరు పైనుంచి వస్తోంది. ఇలాంటి సమయంలో  పోతిరెడ్డిపాడుకి నీరు వదలొద్దని తెలంగాణ అధికారి లేఖరాస్తే  జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు?. ఎన్జీటీ ఆదేశాలను కాదని అధికారులను ఏపీప్రభుత్వం ఎందుకు అనుమతించడం లేదు? ఇలాంటి పరిస్థితులను ఏపీ ప్రభుత్వం ఎందుకు తెచ్చుకుంటోంది?'' అని సోమిరెడ్డి నిలదీశారు. 

''తెలంగాణ ఇష్టానుసారం విద్యుదుత్పత్తి పేరుతో నీటిని వాడేస్తుంటే మొదట్లోనే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేయలేదు? కేసీఆర్ కు నీటికరువు ఎలా ఉంటుందో తెలుసు. ఆయన కూడా గతంలో తమతో మంత్రిగా పనిచేశాడు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక నగరికి వచ్చి, వైసీపీ ఎమ్మెల్యే రోజా ఇంటిలో విందారగించాడు. కేసీఆర్ రాయలసీమను రతనాలసీమను చేస్తానని చెప్పాడని నిన్నటివరకు మీరే చెప్పారు. అంతటి అనుబంధం ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య నిన్నటివరకు ఉందికదా... ఇప్పుడేమైంది?'' అని అడిగారు. 

''గోదావరి నీటిని పట్టిసీమ ద్వారా రాయలసీమకు తెచ్చుకుంటుంటే, వాటిలో కూడా కర్ణాటకకు, తెలంగాణకు భాగముందని గోదావరి బోర్డు చెబుతోంది. కాళేశ్వరం ద్వారా హైదరాబాద్ కు గోదావరి నీటిని టీఆర్ఎస్ ప్రభుత్వం తరలించడం లేదా? అదంతాకూడా సక్రమంగానే జరుగుతోందా? మూసీ పరీవాహక ప్రాంతమైన హైదరాబాద్ ప్రాంతం కృష్ణాపరిధిలోకి రాదా?  ఇదంతా జరుగుతున్నప్పుడు ఇద్దరి మధ్యనా ఈ పొరపచ్ఛాలేమిటి? కృష్ణానీరు పెన్నా బేసిన్ లోకి పోవడానికి వీల్లేదని తెలంగాణ చెబుతుంటే ఈ ముఖ్యమంత్రి మౌనంగా ఉండటమేంటి? కృష్ణా, గోదావరి నీటిని తెలంగాణ హైదరాబాద్ కు తరలించవచ్చు కానీ వృథాగా పోతున్న నీటిని కూడా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయల సీమకు తరలించకూడదా?  అని మాజీ మంత్రి సోమిరెడ్డి నిలదీశారు. 


 

click me!