
జగ్గయ్యపేట : online gameలకు మరో software engineer బలి అయింది. ఆన్లైన్ గేమ్ లో భారీగా నష్టపోయిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చెరువులోకి దూకి బలవన్మరణానికి పాల్పడింది. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట వద్ద చిల్లకల్లు చెరువులో ఆదివారం ఓ యువతి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. పోలీసుల కథనం మేరకు.. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరు గ్రామానికి చెందిన జాస్తి సోమశేఖర్ రెండో కుమార్తె స్వాతి. ఈమె బీటెక్ పూర్తి చేసి ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం కారణంగా ఇంట్లోనే ఉంటుంది. మళ్లీ ఆఫీసులు తెరవడం, అందరూ ఆఫీస్ లోకి రావాలని కంపెనీ ఆదేశించడంతో సోమవారం హైదరాబాద్కు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది.
ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లింది స్వాతి. అలా వెళ్లిన స్వాతి రాత్రి 7 గంటల సమయంలో తల్లి ఫోన్ కి వాట్సాప్ లో ఒక మెసేజ్ పెట్టింది. తాను చిల్లకల్లు చెరువు వద్ద ఉన్నానని.. ఎందుకో బాగా ఒత్తిడికి గురవుతున్నానని.. అది తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని ఆ మెసేజ్ లో తెలిపింది. ఇది చూసిన కుటుంబ సభ్యులు ముందు షాక్ అయ్యారు. ఆ తర్వాత వెంటనే చిల్లకల్లు బయలుదేరి వచ్చి పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు చిల్లకల్లు చెరువు వద్ద శనివారం అర్ధరాత్రి వరకు పోలీసులు గత ఈతగాళ్లతో.. తీవ్రంగా గాలించారు. అయినా స్వాతి కనిపించలేదు.
తండ్రి ఫోన్ లో ఆన్ లైన్ గేమ్స్ ఆడుతూ.. రూ.39 లక్షలు ఖాళీ చేసిన కొడుకు...
ఆదివారం ఉదయం మరోసారి ప్రయత్నించగా.. స్వాతి మృతదేహం దొరికింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జగ్గయ్యపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. అయితే, స్వాతికి ఆన్ లైన్ గేమ్స్ ఆడే అలవాటు ఉందని, ఇటీవల ఆన్లైన్ గేమ్ లో స్వాతి భారీగా నష్టపోయింది అని.. ఆమె ఆ ఒత్తిడి తట్టుకోలేకే ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని కుటుంబ సభ్యులు తెలిపారు.
ఇదిలా ఉండగా, ఆన్ లైన్ గేమ్స్ ఆడుతుండగా తల్లి ఫోన్ లాక్కుందన్న కోపంతో 16 ఏళ్ల బాలుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన మహారాష్ట్రలోని ముంబైలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… జూన్ 9 సాయంత్రం ఓ బాలుడు ఆన్లైన్ గేమ్స్ ఆడుతుండగా తల్లి ఫోన్ తీసుకుంది. ఎప్పుడూ గేమ్స్ కాదు.. చదువుకోవాలని చెప్పింది. దీంతో కోపానికి గురైన బాలుడు సూసైడ్ నోట్ రాసి పెట్టి ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయాడు.
బైటికి వెళ్లిన తల్లి ఇంటికి తిరిగి వచ్చి ఆ లేఖను గుర్తించి చదవగా అందులో తాను ఆత్మహత్య చేసుకునేందుకు ఇంటి నుంచి వెళ్లిపోతున్నానని.. ఇక ఎప్పటికీ తిరిగి రాను అంటూ పేర్కొన్నాడు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వగా రంగంలోకి దిగి పోలీసులు బాలుడి ఆచూకీ కోసం గాలించారు. ఆ తర్వాత మలాద్--కందివాలి రైల్వే స్టేషన్ల మధ్య ఎవరో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం అందడంతో.. అక్కడకు వెళ్లిన పోలీసులు విచారణ జరిపారు. సూసైడ్ చేసుకున్న ది ఇంటి నుంచి వెళ్లిపోయిన బాలుడే అని నిర్ధారించారు. దీంతో రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.