
నెల్లూరు : నెల్లూరు జిల్లా తోడేరు గ్రామంలో చెరువులో ఆరుగురు వ్యక్తులు గల్లంతైన సంగతి తెలిసిందే. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో పడవ చెరువులో మునిగిపోవడంతో ఆరుగురు గల్లంతయ్యారు. సోమవారం ఉదయం నాటికి వీరిలో ఇద్దరి మృతదేహాలు లభించాయి. సోమవారం రాత్రి వరకు మిగిలిన నలుగురి మృతదేహాలు కూడా లభించడంతో సర్వత్ర తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తోడేరు గ్రామంలో ఆదివారం సాయంత్రం రత్నగిరి చెరువులోకి సరదాగా పడవలో షికారుకు వెళ్లారు 10 మంది యువకులు. వీరిలో ఆరుగురు విగత జీవులుగా మారారు.
ఆదివారం సాయంత్రం ఈ ఘటన వెలుగులోకి రావడంతో.. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించిన పోలీసులు గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టారు. అయితే రాత్రి కావడంతో సరైన వెలుతురు లేకపోవడం వల్ల.. ఆదివారం రాత్రి వెతకడం ఆపేసి సోమవారం ఉదయం తిరిగి ప్రారంభించారు. ఉదయం 7:30 గంటలకు మొదట మన్నూరు కళ్యాణ్ (28) మృతదేహం దొరికింది. ఆ తర్వాత పదిన్నర గంటలకు వరుసగా.. అల్లి శ్రీనాథ్ (18), బట్ట రఘు (24), చల్లా ప్రశాంత్ (29), చల్లా బాలాజీ (21) మృతదేహాలు కాస్త సమయం తేడాతో దొరికాయి. వీరి మృతదేహాలకు చెరువు సమీపంలోనే పోస్ట్మార్టం నిర్వహించారు.
నెల్లూరు తోడేరు చెరువులో పడవ బోల్తా.. ప్రమాదంలో గల్లంతైన ఆరుగురిలో, ఇద్దరి మృతదేహాలు లభ్యం..
ఆ తర్వాత పోస్టుమార్టం అయిన వెంటనే మృతదేహాలను అప్పటికే అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే అప్పటికి ఇంకా గల్లంతైన ఆరో యువకుడు దొరకలేదు. దీంతో పోర్టు నుంచి రెండు బోట్లను తీసుకువచ్చి.. దాదాపు పదిమంది గజ ఈతగాళ్లు, సహాయక బృందాలు, పోలీసులు కలిసి ఆ యువకుడి కోసం చెరువును జల్లెడ పట్టారు. సురేంద్ర (19) అనే యువకుడి మృతదేహం సాయంత్రం ఐదున్నర గంటలకు దొరికింది. ఇక.. మృతుల్లో ఒకరైన చల్లా ప్రశాంత్.. చెరువులో పడి గల్లంతయ్యాడు అన్న విషయం తెలిసిన ప్రశాంత్ అమ్మమ్మ బైనా రమణమ్మ (75) తీవ్ర ఒత్తిడికి గురైంది. ఈ ఒత్తిడి తట్టుకోలేక ఆదివారం సాయంత్రం మృతి చెందింది. సోమవారం అతని మృతదేహం లభించింది. రెండు రోజుల తేడాతో ఇంట్లో ఇద్దరు మృతి చెందడంతో అతని కుటుంబ సభ్యులు తీవ్రవేదనలో ఉన్నారు.
ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరులో ఆదివారం సాయంత్రం ఓ దుర్ఘటన చోటుచేసుకుంది. పొదలకూరు మండలం తోడేరు గ్రామ చెరువులో ఓ పడవ బోల్తా పడింది. ప్రయాణికులతో వెళుతున్న ఈ పడవ బోల్తా ఘటనలో ఆరుగురు యువకులు గల్లంతయ్యారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో పడవలో పదిమంది యువకులు ఉన్నారు. వీరిలో ఆరుగురు గల్లంతు కాగా, నలుగురు క్షేమంగా బయటపడ్డారు. పడవ మునకలో గల్లంతైన యువకుల పేర్లు రఘు(24), సురేంద్ర (19), బాలాజీ(21), కళ్యాణ్ (28), త్రినాథ్ (18), ప్రశాంత్(29)గా పోలీసులు తెలిపారు. ఈ ఆరుగురు యువకుల కోసం గాలింపు చర్యలు పొదలకూరు సిఐ సంగమేశ్వర రావు, ఎస్సై ఖరీముల్లా పర్యవేక్షణలో జరిగాయి.