అమరావతి ఇన్ సైడర్ ట్రేడింగ్: టీడీపీ నేత లక్ష్మినారాయణ ఇంట్లో సోదాలు

By telugu team  |  First Published Feb 29, 2020, 1:27 PM IST

చంద్రబాబు ప్రభుత్వ హయాంలోని అక్రమాలపై విచారణ చేయడానికి పూనుకున్న సిఐడీ టీడీపీ నేత లక్ష్మినారాయణ నివాసంలో సోదాలు నిర్వహించింది. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో ఈ సోదాలు జరిగాయి.


విజయవాడ: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై విచారణ సిఐడి తన సోదాలను ముమ్మరం చేసింది. శనివారంనాడు కృష్ణా జిల్లా కంచికచర్లలోని తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నేత నన్నపనేని లక్ష్మినారాయన నివాసంలో సిఐడి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయన కంచికచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా పనిచేశారు. 

ఇంట్లో సోదాలు నిర్వహించడంతో పాటు లక్ష్మినారాయణను విచారిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించడానికి సిఐడి అధికారులు ఇష్టపడడం లేదు. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ ద్వారా భూములు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు రావడంతో సిఐడి అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. 

Latest Videos

undefined

లక్ష్మీనారాయణ మామ శ్రీనివాస రావు చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అడ్వొకేట్ జనరల్ గా పనిచేశారు. లక్ష్మీనారాయణ తనయుడు సీతారామారాజు పోలవరం ప్రాజెక్టు సబ్ కాంట్రాక్టర్ గా కూడా ఉన్నాడు. లక్ష్మినారాయణ నివాసంలో సోదాలు నిర్వహించడానికి సిఐడి అధికారులు శుక్రవారంనాడే ఆయన ఇంటికి చేరుకున్నారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో నోటీసు అతికించి వెనుదిరిగారు. 

దానిపై లక్ష్మినారాయణ స్పందించారు. తాను ఎక్కడికీ వెళ్లలేదని, తన భార్య అనారోగ్యంతో ఉండడంతో ఆస్పత్రికి వెళ్లామని ఆయన చెప్పారు. సిట్ కు అన్ని విధాలుగా సహకరిస్తానని చెప్పారు. శుక్రవారంనాడు సిట్ అధికారులు విజయవాడలోని పటమటలో గల మాజీ మంత్రి, టీడీపీ నేత పత్తిపాటి పుల్లారావు వియ్యంకుడి ఇంట్లో సోదాలు నిర్వహించారు. సిట్ అధికారులు మరింత మంది ఇళ్లలో సోదాలు నిర్వహించే అవకాశం ఉంది. 

click me!