జగన్ క్రూరత్వం, విశాఖ ప్రజలను అవమానిస్తున్నారు: యనమల

By telugu teamFirst Published Feb 29, 2020, 12:18 PM IST
Highlights

చంద్రబాబు విశాఖ పర్యటనను పోలీసులు అడ్డుకోవడంపై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తీవ్రంగా మండిపడ్డారు. ఆ ఘటన ద్వారా జగన్ క్రూరత్వం బయటపడిందని ఆయన వ్యాఖ్యానించారు.

అమరావతి: ప్రజలే చంద్రబాబుపై కోడిగుడ్లు, టమాటాలు విసిరారని  చెప్పి వైసీపీ నేతలు విశాఖ ప్రజలను అవమానిస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకుడు యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. విశాఖ వాసులు వైసీపీ నేతల మాదిరిగా ప్రవర్తించే క్రూరులు కారని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. 

శాంతికి నిదర్శనంగా నిలిచే విశాఖ ప్రజలను వైసీపీ నేతలు రౌడీలు, సంఘ విద్రోహులతో పోలుస్తున్నారని ఆయన విమర్శించారు. రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తూ విశాఖ అభివృద్ధితో పాటు రాష్ట్రాభివృద్ధిని కూడా వైసీపీ అడ్డుకుంటోందని ఆయన వ్యాఖ్యానించారు. 

అల్లర్లను ప్రోత్సహించడం ద్వారా పెట్టుబడులు రాకుండా చేస్తూ ఉపాధికి గండి కొడుతోందని ఆయన అన్నారు. ఈ నెల 27వ తేదీన జరిగిన ఘటనతో ఏపీ సీఎం జగన్ క్రూరత్వం బయటపడిందని, ఆ విషయాన్ని ప్రతి పౌరుడూ గ్రహించాలని యనమల అన్నారు. 

ఇదిలావుంటే, చంద్రబాబు విశాఖ పర్యటనను పోలీసులు అడ్డుకోవడంపై తెలుగుదేశం పార్టీ నేతలు శనివారం గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. తమ విజ్ఞప్తికి గవర్నర్ సానుకూలంగా స్పందించారని భేటీ అనంతరం టీడీపీ నేత వర్ల రామయ్య తెలిపారు. 390 సెక్షన్ ప్రకారం తమ హక్కులను కాపాడాలని కోరినట్లు ఆయన తెలిపారు. 

వైసీపీ నేతలతో పోలీసులు కుమ్మక్కయ్యారని, పోలీసులు వైసీపీ నేతలు చెప్పినట్లు నడుచుకున్నారని టీడీపీ నేతలు గవర్నర్ కు ఫిర్యాదు చేశారు.  

click me!