మంత్రులకు ‘సిట్’ నోటీసులు

First Published Jul 11, 2017, 9:26 AM IST
Highlights

సిట్ విచారణ జరుపుతూ పలువురికి నోటీసులు జారీ చేసింది. మంత్రులతో పాటు వైసీపీ, వామపక్షాలు, లోకసత్తా, బిఎస్పీ తదితర రాజకీయ పార్టీలకూ నోటీసులు పంపింది. ఈనెల 15-20 తేదీల మధ్య స్వయంగా సిట్ ను కలిసి తమ వద్ద ఉన్న ఆరోపణలకు ఆధారాలను అందివ్వాల్సిందిగా పేర్కొంది. కుంభకోణంపై ఇప్పటి వరకూ తమకు 965 ఫిర్యాదులు అందినట్లు బ్రిజ్లాల్ చెప్పారు.

విశాఖపట్నం జిల్లా భూకుంభకోణాలపై విచారణ చేస్తున్న ‘సిట్’ మంత్రులిద్దరికి నోటీసులు జారీ చేసింది. జిల్లాలో జరిగిన భారీ భూకుంభకోణం రాష్ట్రంలో సంచలనం రేపింది. దానిపై ప్రతిపక్షాలన్నీ ఏకమై టిడిపిపై పలు ఆందోళనలు జరిపిన విషయం తెలిసిందే కదా? కుంభకోణంపై సిబిఐ విచారణ జరిపించాలన్న డిమాండ్ తో విపక్షాలు జరిపిన ఆందోళనలతో ఒకరకంగా అధికారపార్టీ దిక్కుతోచని స్ధితిలో జారిపోయింది.

దానికితోడు జిల్లాలో భారీ ఎత్తున వేలాది ఎకరాలు కబ్జా జరిగినట్లు అబవీశాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పలు ఆరోపణలతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూ రికార్డుల ట్యాంపరింగ్ జరిగిందని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ చేసిన ప్రకటన మూలిగే నక్కపై తాటిపండు పడినట్లుగా తయారైంది. కుంభకోణం ఆరోపణలపై తొలుత బహిరంగవిచారణ జరిపిస్తానని ప్రకటించిన చంద్రబాబునాయుడు చివరకు స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీమ్ (సిట్)ను ఏర్పాటు చేసారు.

వెంటనే సిట్ విశాఖ నగరంలో క్యాంపు వేసి విచారణను ప్రారంభించింది. తాజాగా సిట్ ఛీఫ్ వినీత్ బ్రిజ్లాల్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావుకు నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. చింతకాయల చేసిన ఆరోపణలన్నీ సహచర మంత్రి గంటాను ఉద్దేశించినవే అన్న విషయం చిన్నపిల్లాడినడిగానే చెప్పేస్తాడు.

చింతకాయల ఆరోపణల ఆధారంగా ఆందోళనను వైసీపీ బాగా ఉధృతం చేసింది. కుంభకోణంలో గంటా ప్రధానపాత్ర కాగా ఐడుగురు ఎంఎల్ఏలు, ఓ ఎంఎల్సీ కూడా లబ్దిపొందారంటూ ఆరోపణలు చేసింది. కుంభకోణం మొత్తానికి సూత్రదారి నారా లోకేష్ అంటూ ధ్వజమెత్తింది.

అదే విషయమై సిట్ విచారణ జరుపుతూ పలువురికి నోటీసులు జారీ చేసింది. మంత్రులతో పాటు వైసీపీ, వామపక్షాలు, లోకసత్తా, బిఎస్పీ తదితర రాజకీయ పార్టీలకూ నోటీసులు పంపింది. ఈనెల 15-20 తేదీల మధ్య స్వయంగా సిట్ ను కలిసి తమ వద్ద ఉన్న ఆరోపణలకు ఆధారాలను అందివ్వాల్సిందిగా పేర్కొంది. కుంభకోణంపై ఇప్పటి వరకూ తమకు 965 ఫిర్యాదులు అందినట్లు బ్రిజ్లాల్ చెప్పారు.

click me!