అనుభవం లేని ఆధిపత్య పోరు: నారా లోకేష్ పై శమంతకమణి సంచలన వ్యాఖ్య

By telugu teamFirst Published Mar 18, 2020, 4:08 PM IST
Highlights

టీడీపీకి రాజీనామా చేసిన సీనియర్ నేత శమంతకమణి తన కూతురు యామినిబాలతో కలిసి వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. వైసీపీలో చేరిన తర్వాత ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

అమరావతి: తెలుగుదేశం పార్టీ (టీడీపీ)కి రాజీనామా చేసి శమంతకమణి తన కూతురు యామినితో కలిసి వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపి అధినేత వైఎస్ జగన్ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీలో చేరిన తర్వాత శమంతకమణి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ ను ఉద్దేశించి ఆమె ఆ వ్యాఖ్యలు చేశారని భావిస్తున్నారు. టీడీపీలో అనుభవం లేని ఆధిపత్య పోరు ఎక్కువైందని ఆమె మాట్లాడారు. నారా లోకేష్ ను ఉద్దేశించే ఆ వ్యాఖ్యలు చేశారని అనుకుంటున్నారు. 

తాను మనస్తాపానికి గురై టీడీపికి రాజీనామా చేసినట్లు ఆమె తెలిపారు. తనలాంటి సీనియర్ నేతలు చాలా మంది సందిగ్ధంలో ఉన్నారని ఆమె అన్నారు. టీడీపీ నేతలపై నారా లోకేష్ ఆధిపత్యం సహించలేకనే పార్టీ సీనియర్ ఇబ్బందులు పడుతున్నారనే ఆర్థం వచ్చే విధంగా ఆమె మాట్లాడారు. 

కాంగ్రెసు పార్టీ తరఫున శమంతకమణి ఓసారి శింగనమల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత టీడీపీలో చేరారు. 2019లో మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, అనంతపురం జిల్లా నేతల సలహాతో శింగనమల అభ్యర్థిని చంద్రబాబు మార్చేశారు. అప్పటి దాకా ఎమ్మెల్యేగా ఉన్న యామినిని మార్చేసి కొత్తగా వచ్చిన బండారు శ్రావణికి అవకాశం కల్పించారు. 

తన కూతురు యామినిబాల టికెట్ కోసం శమంతకమణి చివరి దాకా ప్రయత్నాలు చేశారు. అయితే, చంద్రబాబు అందుకు అంగీకరించలేదు. పార్టీ అభివృద్ధి కోసం పనిచేసిన తమను కాదని కొత్తగా వచ్చినవారికి అవకాశం కల్పించారని ఆమె అప్పట్లో బహిరంగంగానే మాట్లాడారు. చంద్రబాబు తీరు పట్ల తీవ్రమైన అసంతృప్తితో ఉన్న వారిద్దరు పార్టీ మారారు.

click me!