పవన్, జగన్ లకు చత్వారమా, భూతద్దాలు కావాలా

First Published Jul 6, 2018, 11:00 AM IST
Highlights

మాజీ శైలజానాథ్ గురువారం వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ లపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. జగన్‌, పవన్‌ కల్యాణ్‌లకు చత్వారం వచ్చిందా అని అడిగారు. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు స్తబ్దుగా ఉన్న కాంగ్రెసు పార్టీ దూకుడు పెంచినట్లు కనిపిస్తోంది. కాంగ్రెసు నాయకులు ఒక్కరొక్కరే బయటకు వస్తూ రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్నారు. మాజీ శైలజానాథ్ గురువారం వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ లపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. 

జగన్‌, పవన్‌ కల్యాణ్‌లకు చత్వారం వచ్చిందా అని అడిగారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని, ఇప్పటికే విభజన హామీలన్నింటినీ నెరవేర్చేశామని కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసిందని గుర్తు చేస్తూ దాన్ని చదివేందుకు వారిద్దరికీ ఇంకా పెద్ద భూతద్దాలేమైనా కావాలా అని ప్రశ్నించారు.

అసలు సమస్య ఎక్కడుందో? పరిష్కారం కోసం ఎక్కడ పోరాడాలో తెలియకుండా ముందుగా తాను ప్రస్తావించడం వల్లే హోదా అంశం సజీవంగా ఉందని జగన్‌, పవన్‌ ఎక్కడపడితే అక్కడ మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. హోదాను అటకెక్కిస్తూ కేంద్రం సుప్రీంకోర్టులోనే ఇప్పుడు అఫిడవిట్‌ దాఖలు చేసిందని అన్నారు. 

ఇటువంటి స్థితిలో ఆ అంశం సజీవంగా ఎక్కడుందని అడిగారు. హోదా, విభజన హామీల అమలుపై మోదీపై పోరాడాల్సిన జగన్‌, పవన్‌ ఎందుకు నోరు మెదపడం లేదని, రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెడుతూ ఇప్పుడు మోడీకి భయపడితే.. భవిష్యత్తులో వారు ప్రజలకు ఇంక సేవ చేస్తారా? చేయగలరా? అని ఆయన ప్రశ్నించారు. 
 
 ప్రతిపక్షాలు పోరాడాల్సినవారితోనూ .. పోరాడాల్సిన చోట కాకుండా .. రాష్ట్రంలో తిరిగితే ప్రయోజనం ఏమిటని అన్నారు. హోదా సాధించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంత వైఫల్యం చెందారో.. ప్రతిపక్ష పార్టీలుగా వైసీపీ, జనసేనలదీ అంతే తప్పుందని ఆయన అన్నారు. మాజీ మంత్రి కొండ్రు మురళి కూడా మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

click me!