లీజు కోసం రూ.80 లక్షలు లంచం డిమాండ్.. ఐఏఎస్ శ్రీలక్ష్మిపై సీబీఐ ఆరోపణలు..

By SumaBala BukkaFirst Published Sep 30, 2022, 7:55 AM IST
Highlights

ఉమ్మడి రాష్ట్రంలో మైనింగ్ లీజుల కోసం రూ.80 లక్షలు లంచం ఇవ్వాలంటూ ఐఏఎస్ అధికారిని వై. శ్రీలక్ష్మి డిమాండ్ చేశారని సీబీఐ ఆలోపించింది. 

హైదరాబాద్ : మైనింగ్ లీజులు దక్కాలంటే లక్షలు ఖర్చు అవుతుందంటూ..  దరఖాస్తుదారులను ఉమ్మడి రాష్ట్రంలోని పరిశ్రమలశాఖ అప్పటి కార్యదర్శి, ప్రస్తుత ఏపీ ఐఏఎస్ అధికారి వై. శ్రీలక్ష్మి, గనులశాఖ అప్పటి డైరెక్టర్ వి.డి. రాజగోపాల్ డిమాండ్ చేశారని సిబిఐ వెల్లడించింది. దరఖాస్తులను పరిశీలించడానికి రూ.80 లక్షలు అడిగినట్లుగా లీజు పోటీదారులు వాంగ్మూలం ఇచ్చారని అన్నారు. ఓబుళాపురం మైనింగ్ కేసులో నిందితులైన శ్రీలక్ష్మి, రాజగోపాల్, మాజీ ఐఏఎస్ కృపానందం, గనులశాఖ అప్పటి మంత్రి సబితా ఇంద్రారెడ్డి, గాలి జనార్దన్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు మెఫజ్ అలీ ఖాన్ ల డిశ్చార్జి పిటిషన్ పై సీబీఐ ప్రధాన కోర్టు న్యాయమూర్తి సిహెచ్ రమేష్ బాబు బుధ, గురువారాల్లో విచారణ జరిపారు. 

సిబిఐ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ… శ్రీలక్ష్మి, రాజగోపాల్  తదితరులు గాలి జనార్దన్ రెడ్డి తో కుమ్మక్కయ్యారని చెప్పారు. ఇతరులు లీజు కోసం ప్రయత్నిస్తే లక్షలు ఖర్చు పెట్టగలరా అని అడిగారన్నారు. గాలికి లీజులు దక్కడంలో వీరు కీలక పాత్ర పోషించారని చెప్పారు. గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ కు పాల్పడ్డారని పేర్కొన్నారు.  సింగపూర్, చైనాలకు ఖనిజాన్ని తరలించారని సాక్షులు వాంగ్మూలం ఇచ్చారని అన్నారు. మాజీ ఐఏఎస్ కృపానందం ప్రాసిక్యూషన్కు ఎలాంటి అనుమతులు అవసరం లేదని, కేసు నమోదు చేసే నాటికి ఆయన పదవీ విరమణ చేశారని అన్నారు. దీనిపై తదుపరి విచారణ శుక్రవారం కొనసాగనుంది. 

ఏపీలో టీచర్లను లోపలేస్తున్నారన్న హరీశ్ రావు.. వచ్చి చూడాలంటూ బొత్స కౌంటర్

కాగా, గత నవంబర్ లో  ఓబులాపురం మైనింగ్ కంపెనీ  అక్రమ మైనింగ్ కేసులో నిందితురాలిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి ఏపీ పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి వై. శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు వివాదానికి సంబంధించి సిఆర్ పిసి సెక్షన్ 173 ప్రకారం సీబీఐ తుది నివేదిక ఇచ్చేవరకు తనపై నమోదైన కేసుల విచారణను నిలిపివేయాల్సిందిగా హైదరాబాదులోని సిబిఐ ప్రిన్సిపల్ జడ్జిని ఆదేశించాలంటూ ఆమె దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ డివై చంద్ర చూడ్, జస్టిస్ ఏఎస్‌ బోపన్నతో కూడిన ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం కొట్టివేసింది.

పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది రంజిత్‌ కుమార్‌ వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం పిటిషన్ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. గతంలో ఇదే అభ్యర్థనతో  శ్రీలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా గత సెప్టెంబర్ లో ఏపీ సీఎం వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మికి సీబీఐ కోర్టు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. సెప్టెంబర్ 23న సీబీఐ, ఈడీ కోర్టు జగన్ కేసు మీద విచారణ జరిపింది. దాల్మియా కేసులో శ్రీలక్ష్మి నిందితురాలిగా ఉన్నారు. అయితే, సెప్టెంబర్ 23, 2021న విచారణకు శ్రీలక్ష్మి, ఆమె తరఫు న్యాయవాదులు కోర్టుకు గైర్హాజరయ్యారు. 

దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం ఆమెకు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. ఈ వారెంట్‌ను సెప్టెంబర్ 30లోగా అమలు చేయాలని ఆదేశించింది. మరోవైపు ఇదే కేసులో సీఎం వైఎస్ జగన్‌, విజయసాయిరెడ్డి డిశ్చార్జి పిటిషన్లపై కౌంటరు దాఖలు చేసేందుకు సీబీఐ, ఈడీ గడువు కోరాయి.పెన్నా కేసులో విశ్రాంత ఐఏఎస్‌ జి.వెంకట్రామిరెడ్డి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. దీంతో వెంకట్రామిరెడ్డిపై ఉన్న ఎన్‌బీడబ్ల్యూను న్యాయస్థానం రీకాల్‌ చేసింది. 

click me!