విశాఖ రిషికొండలో సీఎం క్యాంప్ ఆఫీస్.. హింట్ ఇచ్చిన మంత్రి బొత్స సత్యనారాయణ

By Siva KodatiFirst Published Sep 29, 2022, 6:21 PM IST
Highlights

విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌కు సంబంధించి మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రిషికొండలో సీఎం క్యాంప్ ఆఫీస్ కడితే తప్పేంటంటూ ఆయన వ్యాఖ్యానించారు. 

విశాఖ రిషికొండలో సీఎం అధికారిక నివాసం కడితే తప్పేంటంటూ ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తద్వారా పరోక్షంగా సీఎం క్యాంప్ ఆఫీస్ రిషికొండలో అని చెప్పేశారు బొత్స. వచ్చే ఎన్నికల్లో 175కి 175 స్థానాలు గెలుస్తామన్న ఆయన ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తున్నామన్నారు. అచ్చెన్నాయుడికి శరీరం పెరిగింది కానీ.. బుర్ర పెరగలేదంటూ దుయ్యబట్టారు. అచ్చెన్నాయుడు మహాజ్ఞాని అందుకే మమ్మల్ని దద్ధమ్మ అన్నాడని బొత్స ఎద్దేవా చేశారు. ఉత్తరాంధ్రకు టీడీపీ హయాంలో ఏం చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పరిపాలన వికేంద్రీకరణను వ్యతిరేకిస్తున్న టీడీపీ రైతుల రూపంలో రావడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. నేరుగా టీడీపీ కండువాలు కప్పుకొని రావొచ్చు కదా బొత్స వ్యాఖ్యానించారు. విశాఖలో భూములు మాయం చేసిన వాళ్లా మా గురించి మాట్లాడేదంటూ మంత్రి చురకలు వేశారు. విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రావాల్సిందేనంటూ బొత్స తేల్చిచెప్పారు. 

ALso REad:దద్దమ్మల్లారా... అభివృద్ధి చేస్తామంటే ఎవరొద్దన్నారు : వైసీపీ నేతలకు అచ్చెన్నాయుడు కౌంటర్

అంతకుముందు అమరావతి రైతుల పాదయాత్రపై మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలకు ఈ నెల 27న కౌంటరిచ్చారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. పాదయాత్రను అడ్డుకోవడానికి రాష్ట్రమేమైనా నీ జాగీరా అని ప్రశ్నించారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులు వారి హక్కుల కోసం పాదయాత్రలు చేస్తుంటే మంత్రులు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయొద్దా అని వైసీపీ నేతలు ఎదురు ప్రశ్నిస్తున్నారని.. దద్దమ్మల్లారా డెవలప్‌ చేస్తానంటే వద్దంటామా అని ఆయన నిలదీశారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు మూడు రాజధానులు అంటున్నారని.. ఈ మూడేళ్లలో ఉత్తరాంధ్రకు వైసీపీ చేసిందేమిటని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. రుషికొండను కాజేస్తున్నారని.. ఉత్తరాంధ్రలోని భూములను కొట్టేయడానికి నాటకాలు ఆడుతున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. 

click me!