
ఇకనుండి పిడుగుపాటును కూడా ముందే తెలుసుకోవచ్చు. ఈ మేరకు ముఖ్యమంత్రి ‘వజ్రపథ్’ అనే యాప్ ను ఈరోజు సాయంత్రం ఆవిష్కరిస్తున్నారు. ఆ యాప్ ను ఇస్రోతో కలిసి బెంగుళూరులోని ఓ స్టార్టప్ కంపెనీకి చెందిన ఇంజనీరింగ్ విద్యార్ధులు రూపొందించారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్ధ, ఉన్నత విద్యామండలి, విశ్వవిద్యాలయాలు, ఇంజనీరింగ్ కళాశాలల సంయుక్త సహకారంతో యాప్ సేవలు అందుబాటులోకి వస్తోంది. ఇటీవల కాలంలోనే పిడుగుపాటుకు ఎంతమంది మృత్యువాత పడుతున్నారో అందరికీ తెలిసిందే కదా.
అందుకనే పిడుగు వల్ల మరణాలను తప్పించేందుకు ప్రభుత్వం కృషి చేసింది. ఇందుకు అవసరమైన సాంకేతిక సహాయాన్ని ఇస్రో శాస్త్రజ్ఞుల బృందం అందిస్తోంది. చిత్తూరు జిల్లా నుండి శ్రీకాకుళం వరకూ పిడుగుపాటును గుర్తించి ముందే హెచ్చరించే వ్యవస్ధలను ఇంజనీరింగ్ కళాశాలలు, యూనివర్సిటీల్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. పిడుగుపడే అవకాశం ఉండే ప్రాంతాన్ని, సమయాన్ని వజ్రపథ్ ముందే పసిగట్టి ప్రజలకు హెచ్చరికలు పంపుతుందట.
ఈ మేరకు ఇస్రో, రాష్ట్ర ఉన్నత విద్యామండలి అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. పై సంస్దల భాగస్వామ్యంతో ఏపి స్పేస్ ఇన్నోవేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేస్తున్నది ప్రభుత్వం. ఇస్రో విజయవంతంగా పంపుతున్న శాటిలైట్ల పుణ్యమా అంటూ అనేక కొత్త ఆవిష్కరణలు జరుగుతున్నాయి. ప్రజల సంక్షేమం కోసం మరిన్ని ఆవిష్కరణలు వస్తాయంటే అందరికీ సంతోషమే కదా?