సీన్ రివర్స్: నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద వైఎస్ జగన్ ఒత్తిడి

By telugu teamFirst Published Mar 17, 2021, 4:32 PM IST
Highlights


ఏపీలో సీన్ రివర్స్ అయింది. వైెఎస్ జగన్ ప్రభుత్వం వద్దంటున్నా పట్టుబట్టి గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలను నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్వహించారు. ఇప్పుడు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలని జగన్ నిమ్మగడ్డపై పట్టుబడుతున్నారు.

అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీన్ రివర్స్ అయింది. స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడానికి పట్టుబట్టి ఎట్టకేలకు గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎపీ ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్వహించారు. అయితే, సగంలో ఆగిపోయిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను నిర్వహించడానికి ఆయన సముఖంగా లేనట్లు కనిపిస్తున్నారు. 

కరోనా నేపథ్యంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను నిమ్మగడ్డ రమేష్ కుమార్ మధ్యలో వాయిదా వేశారు. అయితే, వాటిని నిర్వహించకుండానే పదవీ విరమణ చేయాలనే ఆలోచనలో ఆయన ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఆయన సెలవుకు కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఆయన పదవీ కాలం ఈ నెల 31వ తేదీతో ముగుస్తోంది. అయితే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను నిర్వహించాలని వైఎస్ జగన్ పట్టుబడుతున్నారు.

కరోనాపై, వాక్సినేషన్ మీద ఆయన బుధవారం సమీక్ష చేశారు. ఈ సమీక్షా సమావేశంలో జగన్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రక్రియ వాక్సినేషన్ కు ఆటంకంగా మారిందని ఆయన అన్నారు. సాధ్యమైనంత త్వరగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించాలని ఆయన అన్నారు. దేశంలో మరోసారి కరోనా వ్యాప్తి చెందుతోందని, వాక్సినేషన్ చేయడానికి వీలుగా ఎన్నికలను వెంటనే ముగించాలని ఆయన అంటున్నారు. 

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియకు ఆరు రోజులే మిగిలి ఉందని, మున్సిపల్ ఎన్నికలు జరిగిన వెంటనే ఆ ఎన్నికలను నిర్వహించి ఉంటే బాగుండేదని ఆయన అన్నారు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను నిర్వహించడానికి గవర్నర్ ను, కోర్టును సంప్రదించాలని ఆయన అన్నారు. 

ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఏపీ గవర్నర్ ను కలవనున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరిగే విధంగా చూడాలని ఆయన గవర్నర్ ను కోరనున్నారు. 

click me!