కడప జిల్లాలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. పులివెందుల నియోజకవర్గానికి చెందిన సతీష్ రెడ్డి మంగళవారం నాడు రాజీ,నామా చేశారు.
కడప జిల్లాలో టీడీపీకి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ కుటుంబానికి ప్రత్యర్థిగా నిలిచిన సతీష్ రెడ్డి టీడీపీకి మంగళవారం నాడు రాజీనామా చేశారు. ఏపీలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో తనకు న్యాయం జరగలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ కారణంగానే తాను టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టుగా ఆయన ప్రకటించారు.
Also read:కడప జిల్లాలో చంద్రబాబు భారీ షాక్: వైసీపీలోకి సతీష్ రెడ్డి
undefined
ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో సీఎంగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి తండ్రి వైఎస్ రాజారెడ్డి హత్య కేసులో కూడ సతీష్ రెడ్డి పై ఆరోపణలు వచ్చాయి. 2019 మార్చి మాసంలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కూడ సతీష్ రెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. ఈ విషయమై సతీష్ రెడ్డి కూడ తన వివరణ ఇచ్చారు.
వివేకానందరెడ్డి హత్య కేసులో తన ప్రమేయం ఉన్నట్టుగా తేలితే బహిరంగంగా ఉరి తీయాలని ప్రకటించారు. మంగళవారం నాడు సతీష్ రెడ్డి టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు.
2019 ఎన్నికల తర్వాత ఏపీ రాష్ట్రంలో టీడీపీ ఓటమి పాలైన తర్వాత సతీష్ రెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. దశాబ్దాలుగా వైఎస్ కుటుంబంతో ఒంటరిపోరాటం చేసిన సతీష్ రెడ్డి టీడీపీకి రాజీనామా చేయడం ఆ పార్టీకి తీవ్ర నష్టమేనని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలోని వేంపల్లి మండలంలో సతీష్ రెడ్డికి మంచి పట్టుంది. సతీష్ రెడ్డితో పాటు ఆయన సోదరి కూడ టీడీపీ రాజకీయాల్లో చురుకుగా పాల్గొనేవారు.
వైఎస్ రాజారెడ్డితో పాటు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హవా కొనసాగిన రోజుల్లో కూడ సతీష్ రెడ్డి పులివెందులలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా టీడీపీని బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు చేశారు.
గత ఏడాది ఎన్నికలు పూర్తైన తర్వాత సతీష్ రెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు మూడు రోజుల క్రితం ఆయన పులివెందులకు వచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలకు దూరంగా ఉండాలని పార్టీ కార్యకర్తల సమావేశంలో ప్రకటించారు.
ఈ ప్రకటనతోనే సతీష్ రెడ్డి టీడీపీకి దూరంగా ఉండే అవకాశం ఉందనే ప్రచారం కూడ సాగింది. అందరూ ఊహించినట్టుగానే సతీష్ రెడ్డి మంగళవారం నాడు టీడీపీకి రాజీనామా చేశారు.
పులివెందుల నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసేందుకు తాను ఎంతో కష్టపడినా కూడ చంద్రబాబునాయుడు తనను విశ్వసించడం లేదని సతీష్ రెడ్డి అభిప్రాయపడ్డారు. చంద్రబాబుకు ఎలా విశ్వాసం కల్పించాలో తనకు అర్ధం కావడం లేదని ఆయన తన సన్నిహితులతో చెప్పినట్టుగా సమాచారం.
పులివెందుల నియోజకవర్గంలో సుధీర్ఘంగా రాజకీయాల్లో సతీష్ రెడ్డి కుటుంబం కొనసాగింది. టీడీపీలోనే ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 2004, 2009 జనరల్ ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై సతీష్ రెడ్డి పోటీ చేశారు.
2004 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేస్తే ఆయనకు 74,432 ఓట్లు వచ్చాయి. సతీష్ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగాడు. సతీష్ రెడ్డికి 33,655 ఓట్లు వచ్చాయి. 2009 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి 1,03,556 ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్ధి సతీష్ రెడ్డికి 34,875 ఓట్లు వచ్చాయి.
కాంగ్రెస్ పార్టీకి వైఎస్ జగన్ రాజీనామా చేసిన తర్వాత పులివెందుల అసెంబ్లీ స్థానానికి విజయమ్మ, కడప ఎంపీ స్థానానికి జగన్ రాజీనామాలు చేశారు. ఈ సమయంలో పులివెందుల నుండి టీడీపీ అభ్యర్థిగా సతీష్ రెడ్డి లేదా ఆయన సోదరిని బరిలోకి దింపాలని పార్టీలో ఓ వర్గం ప్రయత్నించింది. అయితే ఆ సమయంలో టీడీపీలో ఉన్న సీఎం రమేష్ చక్రం తిప్పాడు. దీంతో బీటెక్ రవిని బరిలో దింపారు.కడప ఎంపీ స్థానం నుండి మైసూరారెడ్డి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు.
2011 ఎన్నికల్లో బీటెక్ రవిని టీడీపీ బరిలోకి దింపిన సమయంలో సతీష్ రెడ్డి ఆ సమయంలో కొంత అసంతృప్తితో ఉన్నారని ప్రచారం సాగింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సతీష్ రెడ్డికి టీడీపీ ఎమ్మెల్సీ పదవిని కేటాయించింది. 2014 ఎన్నికల తర్వాత కూడ ఆయనకు టీడీపీ ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టింది.
ఇటీవల కాలంలో కడప జిల్లాకు చెందిన టీడీపీకి చెందిన ఒకరిద్దరూ ముఖ్య నేతలతో వైసీపీ అగ్ర నేతలు సంప్రదింపులు జరిపినట్టుగా సమాచారం. ఈ చర్చల కారణంగానే సతీష్ రెడ్డి టీడీపీకి రాజీనామా చేసినట్టుగా చెబుతున్నారు.
మాజీ మంత్రి రామ సుబ్బారెడ్డి కూడ టీడీపీని వీడుతారని ప్రచారం సాగుతోంది. కానీ ఆయన ఈ ప్రచారాన్ని ఖండించారు. కడప జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకపక్ష విజయాలు నమోదు చేసుకోవడం కోసం వైసీపీ టీడీపీ నేతలకు వల వేస్తున్నట్టుగా సమాచారం.