
ఉద్యోగుల్లో బిపి పెరిగిపోతోంది. జీతాలు అందుకునేందుకు ఇంక ఒక్క రోజే ఉండటంతో లక్షలాది మంది ఉద్యోగుల్లో ఆందోళన పెరిగిపోతోంది. ఏ ఇద్దరు కలుసుకున్నా జీతాల గురించే మాట్లాడుకుంటున్నారు. నవంబర్ 30 లేదా డిసెంబర్ నెల 1వ తేదీన బ్యాంకుల్లో జమఅయ్యే జీతాలను ఏ విధంగా చేతికి తీసుకోవాలో అర్ధంకాక ఉద్యోగుల్లో ఆందోళన పెరిగిపోతోంది.
రాష్ట్రప్రభుత్వం నుండి జీతాలు అందుకుంటున్న వారు, పెన్షన్లు అందుకుంటున్న వారు కలిపి సుమారు 8 లక్షలపై మాటే. వారందరికీ నెలకు సుమారు రూ. 3 వేల కోట్లు అవసరమవుతుంది. విషయమేమిటంటే, రూ. 3 వేల కోట్లను ఇవ్వటానికి ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బందీ లేదు. అయితే, ఆ మొత్తాన్ని బ్యాంకుల్లో జమచేయకుండా నేరుగా తమ చేతికే ఇచ్చేయాలని ఉద్యోగుల డిమాండ్ తోనే సమస్యలు.
సంవత్సరాల తరబడి ఉద్యోగుల జీతాలు కానీ, పెన్షన్లు గానీ ప్రభుత్వం వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేస్తోంది. మొన్నటి 8వ తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోడి పెద్ద నోట్లను రద్దు చేయటంతో సమస్య మొదలైంది. అయితే, నోట్ల రద్దైంది 8వ తేదీ కావటంతో అప్పటికే ఖాతాల్లోని డబ్బులో చాలా వరకూ అవసరాలకు ఖర్చు చేసారు. కాకపోతే, ఇంటికి తెచ్చుకున్న జీతం డబ్బుల్లోని పెద్ద నోట్లను చెల్లుబాటు చేసుకొవటానికి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అందుకనే నెలపాటు ఇల్లు గడవటానికి ఇబ్బందులు ఎదురవ్వలేదు.
అయితే, ఇపుడు నెల మొదలవ్వబోతోంది. జీతాలు మొత్తం బ్యాంకుల్లో జమైనా అవసరాల మేరకు చేతికి రాదు. అందులోనూ చాలా బ్యాంకులు ఖాతాదారులు ఒకసారికి రూ. 2 వేలు మాత్రమే ఇస్తున్నాయి. కొన్ని బ్యాంకుల్లో రూ. 10 వేలు ఇస్తున్నారు. అయితే, ఇచ్చేది రూ. 2 వేల నోట్లు మాత్రమే ఇస్తున్నారు. దానికి చిల్లర కావాలంటే మళ్ళీ మార్కెట్లో ఇబ్బందే.
ఎన్నిరోజులు తాము బ్యాంకు క్యూ లైన్లలో నిలబడితే ఇంటి అవసరాలకు సరిపడా డబ్బు అందుతుందన్నది ఉద్యోగుల ప్రశ్న. అయితే, అవసరాలు, ఉద్యోగికైనా ప్రైవేటు వ్యక్తులకైనా ఒకటే. కాబట్టి ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా నిబంధనలు మార్చటం సాధ్యం కాదు. ఈ విషయం వారికి కూడా తెలుసు.
అయితే, ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని మొదటి వారంలో డబ్బులు డ్రా చేసుకునే విషయంలో నిబంధనలను కేంద్రం సడలిస్తేనే సమస్యలు తప్పుతాయి. లేకపోతే మిగితావారితో పాటు ఉద్యోగులు కూడా ఇబ్బందులు పడక తప్పదు.