
అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం భారీగా అప్పులు చేస్తోంది... ఇష్టమొచ్చినట్లు ప్రజా ధనం పంచి పెడుతున్నారన్న ప్రతిపక్షాల విమర్శలపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందిచారు. ఓట్లకోసమో, ఎన్నికల సమయంలో తాయిలాల కోసమో డబ్బులు పంచడం లేదని... సంక్షేమం కోసమే ప్రజల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని అన్నారు. పార్టీలు, కులమతాలతో సంబంధం లేకుండా అర్హులందరికీ డబ్బులు, సంక్షేమం అందిస్తున్నామని అన్నారు. పేదరికం నుండి బయటపడి సొంతకాళ్లపై నిలబడేలా సంక్షేమం అమలు చేస్తున్నామని సజ్జల తెలిపారు.
ఏపీ అసెంబ్లీలో జరిగిన నూతన ఎమ్మెల్సీల ప్రమాణస్వీకార కార్యక్రమంలో సజ్జల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ముఖ్యమంత్రి జగన్ దేశానికే తలమానికంగా ఏపీని తీర్చిదిద్దుతున్నారని అన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ తో పాటు లెప్ట్ పార్టీలు సైతం సంపన్నుల వైపు నిలబడితే జగన్ ఒక్కరు పేదల పక్షాన నిలబడ్డారని అన్నారు. అందువల్లే జగన్ పై ప్రతిపక్షాలన్నీ మూకుమ్మడిగా తోడేళ్ళు మందలా ఎటాక్ చేయాలని చూస్తున్నాయని అన్నారు. ఏమరుపాటుగా ఉంటే వారు చెప్పేదే వాస్తవం అనిపిస్తుందని సజ్జల అన్నారు.
వైసిపి పార్టీ మరింత బలోపేతం అవుతుండటంతో పాటు జగన్ తీసుకునే నిర్ణయాలు చంద్రబాబు రాజకీయ జీవితానికి ఉరతాడులా మారుతున్నాయని అన్నారు. అందువల్లే చంద్రబాబు ఏజెంట్ పవన్ రంగంలోకి దిగాడన్నారు. ప్రభుత్వం ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని... కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మొత్తం వేరేగా ఉందన్నారు. రాష్ట్రంలోని 80 శాతం కుటుంబాలు జగన్ తో ఉన్నామని చెబుతున్నాయని అన్నారు. కాబట్టి తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మకుండా చూడాల్సిన బాధ్యత వైసిపి నాయకులు, కార్యకర్తలదే అని అన్నారు. ఎన్నికల యుద్ధం ఎలా జరిగినా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు సజ్జల రామకృష్ణారెడ్డి.
Read More వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం..
చంద్రబాబు ప్రస్తుతం కుటుంబసమేతంగా నివాసముంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ అక్రమాలకు చిరునామాగా సజ్జల పేర్కొన్నారు. లింగమనేని రమేష్ కు ఒక్క రూపాయి కూడా చంద్రబాబు రెంట్ చెల్లించలేదు....ఏ హోదాతో ఆయన అక్కడ ఉన్నారో తెలియదన్నారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రగా వుండగా దేశభక్తితోనే తన ఇంటిని ప్రభుత్వానికి ఇచ్చానని లింగమనేని కోర్టుకు చెప్పారని.... మరి సీఎం పదవి కోల్పోయాక ఎందుకు ఖాళీ చేయలేదు? అని ప్రశ్నించారు. చంద్రబాబు బరితెగింపు తనానికి ఉదాహరణే ఆయన ఉంటున్న నివాసం అని సజ్జల ఆరోపించారు.
చంద్రబాబు హయాంలో రాజధాని అమరావతి నిర్మాణం పేరిట దేశంలోనే అతిపెద్ద స్కాం జరిగిందని సజ్జల ఆరోపించారు.పేదలకు మాయమాటలు చెప్పి కోట్ల రూపాయల విలువైన భూమి దోచేయాలని చూసారన్నారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఏజెంట్లతో కలిసి పేదలకు స్థలాలు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని సజ్జల మండిపడ్డారు.
కరుడు గట్టిన దుర్మార్గులు,పెత్తందార్ల పక్షాన టీడీపీ,జనసేన,కమ్యూనిస్టులు ఒక్కటయ్యారని సజ్జల పేర్కొన్నారు. వీరంతా కలిసి కుట్రపూరితంగా జగన్ పై దాడి మొదలు పెట్టారన్నారు. ఇది పొలిటికల్ వార్...నిజాయితీకి,అబద్దానికి మధ్య యుద్దం జరుగుతుందని అన్నారు. నిజం వైపు వైసీపీ ఉంటే అబద్దం వైపు అందరూ ఒక్కటయ్యారని అన్నారు. ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండి పనిచేయాని వైసిపి నాయకులు, కార్యకర్తలకు సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు.