ఏపీలో బీఆర్ఎస్ పోటీ చేస్తే మంచిదే.. వైసీపీ మద్దతుపై సజ్జల కీలక కామెంట్స్..

By Sumanth KanukulaFirst Published Dec 12, 2022, 2:32 PM IST
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)తో జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే పీలో బీఆర్ఎస్‌‌కు మద్దతుపై వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)తో జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లో కూడా బీఆర్ఎస్ కార్యాలయం ఏర్పాటు కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఏపీలో బీఆర్ఎస్‌‌కు మద్దతుపై వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్‌కు మద్దతు ఇవ్వాలని కేసీఆర్ కోరితే ఆలోచిస్తామని చెప్పారు. ఇలాంటి విషయాల్లో సీఎం జగన్ పార్టీలో అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. అయితే ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకునే ఆలోచన వైసీపీకి లేదన్నారు. 

రాజకీయ పార్టీగా ఎవరు ఎక్కడైనా పోటీ చేయవచ్చని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. విభజన హామీలపై తాము పోరాటం చేస్తూనే ఉంటామని చెప్పారు. ఏపీలో బీఆర్ఎస్ పోటీ చేస్తే మంచిదేనని అన్నారు. 

ఇదిలా ఉంటే.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు‌పై ఏపీ ప్రభుత్వం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు ఎక్కడికి వెళ్లిన రోడ్లను బ్లాక్ చేసి.. ట్రాఫిక్ ఉన్నచోట మాత్రమే మీటింగ్‌లు పెడుతున్నారని విమర్శించారు. రోడ్లమీద కాకుండా చంద్రబాబు ఎక్కడైన గ్రౌండ్‌లో మీటింగ్ పెడుతున్నారా అని  ప్రశ్నించారు. ట్రాఫిక్ ఉన్నచోట నిలబడి ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై బెదిరింపులకు దిగుతున్నారని అన్నారు. ఆయన ఏదనుకుంటే అదే రూల్ అని భావిస్తున్నారని మండిపడ్డారు. 

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ కూడా ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటంకు వచ్చినప్పుడు వాహనం టాప్ మీద ఎక్కి ప్రయాణించారని అన్నారు. ఆ బ్యాచ్‌ అంతా వారికి ఎలాంటి రూల్స్ ఉండవని అనుకుంటున్నారని విమర్శించారు. అలాంటివారు వైసీపీ‌ని ప్రశ్నించడం చూస్తే.. వారి స్వభావం ఏమిటో తెలుస్తుందని అన్నారు. చంద్రబాబు, ఆయన కొడుకు, దత్తపుత్రుడు‌లు పిచ్చెక్కి మాట్లాడుతున్నారని విమర్శించారు. పైత్యం ఎక్కువ అయిపోయి.. ప్రభుత్వంపై విషయం కక్కుతున్నారని మండిపడ్డారు.

click me!