
నెల్లూరు: 'ప్రయాణికులే మా సంస్థకు నిధి... వారిని గౌరవించడం మా విధి' అని ఆర్టిసి బస్సుల్లో రాసివుండటం మనం చూస్తుంటాం. కానీ ఆ మాటలకు రాతలకే పరిమితమై ఆర్టిసి సిబ్బంది ప్రయాణికులతో దురుసుగా, అమర్యాదగా ప్రవర్తించిన ఘటనలు చాలా వెలుగుచూసాయి. తాజాగా నెల్లూరు జిల్లా కావలి ఆర్టిసి డిపోకు చెందిన బస్సులో ప్రయాణించిన తనతో డ్రైవర్,కండక్టర్ అసభ్యంగా ప్రవర్తించారని ఓ యువతి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ప్రైవేట్ వాహనాల్లోనే అనుకుంటే ఆర్టిసి బస్సుల్లోనూ ఆడపిల్లలకు రక్షణ లేదని ఈ ఘటన బయటపెట్టింది.
బాధిత యువతి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కావలి నుండి ఒంగోలుకు వెళ్లే ఆర్టిసి పల్లెవెలుగు బస్సులో మార్గమధ్యలోని చాగోలు గ్రామానికి వెళ్లేందుకు ఓ యువతి ఎక్కింది. అయితే ఆమె లగేజీ బ్యాగుల విషయంలో కండక్టర్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయంలోనే ప్రయాణికురాలనే గౌరవం కాదు సాటిమహిళ అనే జాలిలేకుండా అసభ్యం పదజాలంతో దూషించడమే కాదు తీవ్రంగా ఇబ్బందిపెట్టారని యువతి ఆరోపిస్తోంది.
Video
మహిళా కండక్టర్ తో పాటు మహిళా డ్రైవర్ కూడా తనతో దురుసుగా ప్రవర్తించినట్లు బాధిత యువతి తెలిపింది. అటవీ ప్రాంతంలో బస్సును నిలిపి తనను దింపివేయడానికి ప్రయత్నించారని... బలవంతంగా బస్సులోంచి తోసేసే ప్రయత్నం చేసారని యువతి ఆరోపిస్తోంది. అయితే మిగతా ప్రయాణికులు ఆడబిడ్డను ఇలా అడవిలో ఒంటరిగా దింపివేయడంపై అభ్యంతరం వ్యక్తం చేయడంలో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారని బాధిత యువతి తెలిపింది.
ఇలా అవమానకర పరిస్థితుల మధ్యే స్వగ్రామానికి చేరుకున్న యువతి విషయాన్ని కుటుంబసభ్యులకు తెలిపింది. దీంతో అందరూకలిసి కావలి డిపోకు వెళ్లి అసభ్యంగా ప్రవర్తించిన బస్సు డ్రైవర్, కండక్టర్ పై ఉన్నతాధికారులకు పిర్యాదు చేసారు. అయితే వారితోనూ ఆర్టిసి సిబ్బంది దురుసుగా ప్రవర్తించారని... ఉన్నతాధికారుల ముందే సదరు డ్రైవర్, కండక్టర్ ఏం చేసుకుంటారో చేసుకుపొండంటూ మాట్లాడారని యువతి తెలిపింది.
ఇలా తమతో దురుసుగా ప్రవర్తించిన డ్రైవర్, కండక్టర్ తిరిగి తమపైనే పోలీసులకు ఫిర్యాదు చేసారని బాధిత యువతి వాపోయింది. తనపై కేసు నమోదయినట్లు పోలీస్ స్టేషన్ నుండి ఫోన్ రావడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారని యువతి పేర్కొంది. ఆర్టిసి ఉన్నతాధికారులు స్పందించి ప్రయాణికురాలినైన తనతో అసభ్యంగా ప్రవర్తించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని బాధిత యువతి కోరుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏపీఎస్ ఆర్టీసీ బస్సు నందు ప్రయాణం సురక్షితం అని... ప్రతి ఒక్కరు ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం చేయండి అని ప్రచారం చేసుకుంటోంది. కానీ బస్సుల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది మాత్రం ప్రయాణికులతో అసభ్యంగా ప్రవర్తించడం, పలు రకాలుగా ఇబ్బందులకు గురి చేయడం చూస్తుంటే ఆర్టీసీ బస్సు ప్రయాణం కన్నా ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించడమే సురక్షితంగా ఉంటుందేమోనని అనిపిస్తుందని బాధితురాలు పేర్కొంది.
ఒంటరిగా ప్రయాణిస్తున్న యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా ఆమెపైనే తప్పుడు కేసులు నమోదు చేయడం చూస్తుంటే చాలా బాధగా ఉందని బాధిత యువతి కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి యువతికి జరిగినటువంటి అవమానం, ఇబ్బందులపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం తెలిపింది.