సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సెక్యూరిటీ పరికరాల కొనుగోలు విషయంలో అవకతవకలకు పాాల్పడిందని వైఎస్ జగన్ సర్కార్ సస్పెన్షన్ విధించింది. ఈ విషయమై హైకోర్టు , సుప్రీంకోర్టుల్లో కూడా ఏబీ వెంకటేశ్వరరావుేకు అనుకూలమైన తీర్పులు వచ్చాయి.
అమరావతి: ఐపీఎస్ అధికారి AB Venkateswara Raoపై సస్పెన్షన్ ను ఎత్తివేసింది ఏపీ సర్కార్, జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ను సుప్రీంకోర్టు ఈ ఏడాది ఏప్రిల్ 22న రద్దు చేసింది. హైకోర్టు ఉత్తర్వుల్లో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు తెలిపింది. ఏబీ వెంకటేశ్వరరావును మళ్లీ సర్వీసుల్లోకి తీసుకోవాలని కోరింది.
నిఘా పరికరాల కొనుగోలులో అవకతవకలకు పాాల్పడ్డారనే ఆరోపణలతో ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు వైఎస్ జగన్ ప్రభుత్వం 2020 ఫిబ్రవరిలో సస్పెండ్ చేసింది. అఖిల భారత సర్వీసు ఉద్యోగుల రూల్స్ ప్రకారంగా సస్పెన్షన్ రెండేళ్లకు మించి ఉండకూడదని ఏబీ వెంకటేశ్వరరావు తరపున న్యాయవాది వాదించారు. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ని కూడా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది., సస్పెన్షన్ రెండేళ్లు ముగిసనందున ఇకపై సస్పెన్షన్ అమల్లో ఉండని సుప్రీంకోర్టు తెలిపింది.
చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో ఏబీ వెంకటేశ్వరరావు ఇంటలిజెన్స్ చీఫ్ గా ఉన్నారు. అయితే ఇజ్రాయిల్ నుండి నిఘా పరికరాల కొనుగోలులో ఏబీ వెంకటేశ్వరరావు నిబంధనలను ఉల్లంఘించారని జగన్ సర్కార్ ఆయనపై కేసు నమోదు చేసింది. అంతేకాదు ఆయనను సస్పెండ్ చేసింది.
also read:ఏబీ వెంకటేశ్వరావును కలవని సీఎస్ సమీర్ శర్మ.. వెయిటింగ్ రూంలో నిరీక్షణ.. అయినా కానీ..
తనపై విధించిన సస్పెన్షన్ ముగిసిందని ఏబీ వెంకటేశ్వరరావు ఈ ఏడాది మార్చి 25న ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు కూడా లేఖ రాశారు. ప్రతి ఆరు మాసాలకు ఓసారి తనపై విధించిన సస్పెన్షన్ ను పొడిగిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. తనపై విధించిన సస్పెన్షన్ ఈ ఏడాది జనవరి 27వ తేదీతో ముగిసిందన్నారు.2021 జూలైలో తనపై విధించిన సస్పెన్షన్ ను చివరిసారిగా పొడిగించిన విషయాన్ని వెంకటేశ్వరరావు గుర్తు చేశారు.
తనపై విధించిన సస్పెన్షన్ కు సంబంధించిన జీవోలను రహస్యంగా ఉంచారని కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. కానీ తనకు కూడా కాపీ ఇవ్వలేదని ఆయన గుర్తు చేశారు. ఎలా చూసినా కూడా తన సస్పెన్షన్ ముగిసిందని ఆయన తేల్చి చెప్పారు.
రెండేళ్లకు మించి సస్పెన్షన్ కొనసాగించాలంటే కేంద్ర హోంశాఖ అనుమతి తీసుకోవాల్సిందేనని చెప్పారు. గడువులోపుగా కేంద్ర హోంమంత్రిత్వశాఖ నుండి తన సస్పెన్షన్ ను పొడిగించాలని కోరలేదని ఆ లేఖలో సీఎస్ కు గుర్తు చేశారు. దీంతో తన సస్పెన్షన్ ముగిసినట్టేనని ఆయన గుర్తు చేశారు.సర్వీస్ రూల్స్ ప్రకారంగా తన సస్పెన్షన్ పూర్తైనందున తనకు పూర్తి జీతం ఇవ్వాలని కూడా ఆయన ఆ లేఖలో సమీర్ శర్మను కోరారు.
ఈ లేఖ రాసిన తర్వాత ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో పెగాసెస్ అంశంపై చర్చ జరిగింది. ఈ విషయ,మై హౌస్ కమిటీని ఏర్పాటు చేశారు.ఈ విషయమై కూడా ఏబీ వెంకటేశ్వరరావు స్పందించారు. 2019 మే వరకు పెగాసెస్ సహా ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్ వేర్ ను ఉపయోగించలేదని ఆయన స్పష్టం చేశారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ వ్యాఖ్యలు చేసినందుకు గాను ఆయనకు పీఎస్ సమీర్ శర్మ షోకాజ్ నోటీసు ఇచ్చారు. అయితే ఈ షోకాజ్ నోటీసుకు ఏబీ వెంకటేశ్వరరావు సమాధానమిచ్చారు. తనపై వ్యక్తిగత ఆరోపణలు చేసినందుకే తాను మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడినట్టుగా ఏబీ వెంకటేశ్వరరావు వివరించారు.
తన సస్పెన్షన్ పై సుప్రీంకోర్టు ఆదేశాలను ఈ ఏడాది ఏప్రిల్ 29న ఏపీ సీఎస్ సమీర్ శర్మకు అందించారు ఏబీ వెంకటేశ్వరరావు. అయితే సస్పెన్షన్ ఎత్తివేతపై ప్రభుత్వం నుండి స్పందన రాలేదు. దీంతో ఈ నెల 12న మరోసారి ఏపీ సీఎస్ సమీర్ శర్మను కలిసేందుకు ఏబీ వెంకటేశ్వరరావు వచ్చారు. అయితే ఏబీ వెంకటేశ్వరరావును కలవకుండానే ఏపీ సీఎస్ సమీర్ శర్మ సెక్రటేరియట్ నుండి వెళ్లిపోయారు. దీంతో సీఎస్ ను కలవకుండానే ఏబీ వెంకటేశ్వరరావు సెక్రటేరియట్ నుండి ఇంటికి వెళ్లిపోయారు.ఇవాళ ఉదయం ఏబీ వెంకటేశ్వరరావుపై విధించిన సస్పెన్షన్ ను ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.