అరకు: లోయలోకి దూసుకెళ్లిన టూరిస్ట్ బస్సు.. నలుగురు దుర్మరణం, ఇంకా పెరిగే అవకాశం

By Siva KodatiFirst Published Feb 12, 2021, 8:34 PM IST
Highlights

ప్రముఖ పర్యాటక కేంద్రం  విశాఖ జిల్లా అరకులో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళ్తున్న టూరిస్ట్ బస్సు దూసుకెళ్లింది. అనంతగిరి మండలం డముకలోని ఐదో నెంబర్ మలుపు వద్ద ఈ ప్రమాదం సంభవించినట్టుగా తెలుస్తోంది.

ప్రముఖ పర్యాటక కేంద్రం  విశాఖ జిల్లా అరకులో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం పాలవ్వగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

ప్రయాణికులతో వెళ్తున్న టూరిస్ట్ బస్సు ఒక్కసారిగా లోయలోకి దూసుకెళ్లింది. అనంతగిరి మండలం డముకలోని ఐదో నెంబర్ మలుపు వద్ద ఈ ప్రమాదం సంభవించినట్టుగా తెలుస్తోంది.

అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు 108 ద్వారా క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తున్నారు. ప్రయాణికులంతా హైదరాబాద్‌కు చెందిన వారిగా తెలుస్తోంది.   ప్రమాద సమయంలో బస్సులో 30 మంది వున్నట్లుగా తెలుస్తోంది. వీరిలో పెద్దలు 23 మంది, చిన్నారులు ఏడుగురు వున్నారు. 

వీరంతా ఫిబ్రవరి 10న హైదరాబాద్ నుంచి దినేశ్ ట్రావెల్స్ బస్సులో అరకు బయల్దేరారు. తిరిగి 14న హైదరాబాద్‌కు రావాల్సి వుంది. ఆలోగా ఈ ప్రమాదం జరగడంతో బంధువులు, కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. బస్సు బ్రేకులు ఫెయిల్ అవ్వడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది

మరోవైపు బస్సు ప్రమాదం గురించి తెలుసుకున్న తెలంగాణ గవర్నర్ తమిళిసై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

ప్రమాద వివరాల కోసం హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. వివరాలకు 08912590102, 08912590100 నెంబర్లను సంప్రదించాలని తెలిపారు.

 

click me!