
విశాఖపట్నం: 20మంది ప్రయాణికులతో కూడిన బొలెరో వాహనం రోడ్డుప్రమాదానికి(road accident) గురయ్యింది. ఇవాళ (ఆదివారం)తెల్లవారుజామున పొగమంచు కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటన విశాఖపట్నం (visakhapatnam) జిల్లాలో చోటుచేసుకుంది.
విశాఖపట్నం జిల్లాలోని జి మాడుగుల మండలం కొడపల్లి గ్రామంలో తెల్లవారుజామున బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. పొగమంచుతో దారి సరిగ్గా కనిపించక వాహనం ప్రమాదానికి గురయ్యింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మిగతావారంతా చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు.
ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను సమీపంలోని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
read more Hyderabad Accident: శామీర్ పేటలో బీభత్సం... ఏడు కార్లను ఢీకొట్టిన ఆర్మీ వాహనం
తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకూ చలి తీవ్రత పెరుగుతోంది. పగటి పూట కూడా ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. ఇక రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. తెల్లవారుజామున అయితే భారీగా పొగమంచు కురుస్తోంది. విశాఖ మన్యం ప్రాంతంలో అయితే పొగమంచుతో ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.
ఇదిలావుంటే ప్రకాశం జిల్లాలో (prakasam district)ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. విద్యార్ధులతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా.. 15 మంది విద్యార్ధులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో ట్రాక్టర్‌లో 30 మందికి పైగా విద్యార్ధులు వున్నట్లుగా తెలుస్తోంది. వీరంతా కంభాలపాడు బెల్లంకొండ పాలిటెక్నిక్ కాలేజీలో (bellamkonda polytechnic college) హార్టికల్చర్ విద్యార్ధులుగా సమాచారం.
పొదిలి మండం కంభాలపాడు వద్ద ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన విద్యార్థులు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ప్రమాదస్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.