ఏపీఎన్జీవో వర్సెస్ ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు : బండి శ్రీనివాసరావు వ్యాఖ్యలకు సూర్యనారాయణ కౌంటర్

By Siva KodatiFirst Published Jan 20, 2023, 2:24 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగుల మధ్య వివాదం ముదురుతోంది. జీతాలు సకాలంలో చెల్లించడంతో పాటు తమకు రావాల్సిన బెనిఫిట్స్‌ను అందించాలంటూ ప్రభుత్వ ఉద్యోగం సంఘం నేతలు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలవడం కలకలం రేపుతోంది. 

ప్రభుత్వ ఉద్యోగులకు గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేసే అధికారం లేదంటూ ఏపీ ఎన్జీవో నేత బండి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ. గవర్నర్‌ను కలిస్తే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. ఒకటో తేదీన జీతాలు చెల్లించాలన్న జీవోలు వున్నాయి కానీ, చట్టం లేదని తెలిపారు. చట్టాలు వున్నట్లు చూపిస్తే క్షమాపణలు చెబుతామని సూర్యనారాయణ అన్నారు. జీతాల విషయంలో చట్టం చేయాలని కోరితే సంఘం గుర్తింపును రద్దు చేయమంటారా అని ఆయన ప్రశ్నించారు. సమ్మె చేస్తామని తాము ఎక్కడా చెప్పలేదని గుర్తుచేశారు. 

కాగా.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు, ఎన్జీవో నేతల మధ్య విభేదాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. గురువారం ప్రభుత్వ ఉద్యోగం సంఘం, ఇతర ఉద్యోగులు గవర్నర్‌ను కలిసి వినతిపత్రం ఇవ్వడం కలకం రేపింది. దీనిని ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు ఖండించారు. గవర్నర్‌కు ఫిర్యాదు చేసే అధికారం ప్రభుత్వ ఉద్యోగులకు లేదన్నారు. నియమ నిబంధనలు పాటించని పక్షంలో గుర్తింపు రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి వుందన్నారు. సూర్య నారాయణ వెనుక ఎవరున్నారో, ఏ శక్తి ఆయనను నడిపిస్తుందో ఉద్యోగులు గమనిస్తున్నారని బండి శ్రీనివాసరావు ఆరోపించారు. ఇప్పటి వరకు ఓపికపట్టామని, ఇకనైనా ఇలాగే వ్యవహరిస్తే సహించేది లేదన్నారు. 

ALso REad : ఏప్రిల్ నుండి ఆందోళనలు: వేతన బకాయిలపై గవర్నర్ కు ఏపీ ఉద్యోగ సంఘాల నేతల ఫిర్యాదు

అంతకుముందు వేతన బకాయిలపై  ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు  గురువారం నాడు ఏపీ గవర్నర్  బిశ్వభూషణ్ హరిచందన్ కు ఫిర్యాదు  చేశారు. ఎనిమిది ఉద్యోగ సంఘాల నేతలు  ఏపీ గవర్నర్ తో  భేటీ అయ్యారు.జీపీఎఫ్,  మెడికల్ బిల్లులు , డీఏలు, రిటైర్మెంట్  బెనిఫిట్స్ బకాయిల చెల్లింపులో  జోక్యం చేసుకోవాలని  గవర్నర్ ను ఉద్యోగ సంఘాల నేతలు  కోరారు. ఈ మేరకు  గవర్నర్ కు వినతి పత్రం సమర్పించారు.

ఉద్యోగులకు  రావాల్సిన  ఆర్ధిక ప్రయోజనాలు  స్థంభించాయని ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపించారు. తమ ను రక్షించాలని గవర్నర్ కు మొరపెట్టుకున్నామని  ఆయన  చెప్పారు. ఉద్యోగులకు  న్యాయబద్దంగా చెల్లించాల్సిన బకాయిలను తక్షణమే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని  ఉద్యోగ సంఘాల నేతలు కోరారు.  ఉద్యోగులకు  బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వమే చట్టాలను అతిక్రమిస్తుందని  ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపించారు. 

click me!