
ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నానితో (Perni Nani) డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) భేటీ అయ్యారు. ఈ భేటీలో సినిమా టికెట్ల ధరల వ్యవహారంపై (Ticket pricing Issue) చర్చ జరగనుంది. ఏపీలో గత కొంతకాలంగా సినిమా టికెట్ ధరలపై వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆర్జీవీ ఏపీ ప్రభుత్వానికి, పేర్ని నానికి ట్విట్టర్ వేదికగా ప్రశ్నలు సంధించారు. వాటికి పేర్ని నాని కూడా కౌంటర్ ఇచ్చారు. ఇలా ఇద్దరి మధ్య ట్వీట్స్ వార్ కొనసాగింది. ఈ క్రమంలోనే సమస్య పరిష్కారానికి ఆర్జీవీ మంత్రి పేర్ని నాని అపాయింట్‌మెంట్ కోరారు. ఇందుకు సానుకూల స్పందన రావడంతో.. నేడు సచివాలయంలో ఇరువురు భేటీ అయ్యారు.
ఈ భేటీకి ముందు ఆర్జీవీ మాట్లాడుతూ.. తాను ఇక్కడికి సినీ పరిశ్రమ ప్రతినిధిగా వచ్చానని తెలిపారు. తన అభిప్రాయాలు చెప్పేందుకు వచ్చినట్టుగా వెల్లడించారు. ఇతరుల వ్యాఖ్యలపై తాను స్పందించనని అన్నారు. తాను చెప్పదలిచినది మాత్రమే భేటీలో ప్రస్తావించనున్నట్టుగా వెల్లడించారు. భేటీ తర్వాతే వివరాలు చెప్పగలనని తెలిపారు. అయితే భేటీ ప్రస్తుతం సినీ పరిశ్రమతోపాటు.. ఏపీ రాజకీయా వర్గాల్లో హాట్ టాఫిక్‌గా మారింది.