
పార్టీ ద్వారా సంక్రమించిన అన్నీ పదవులకూ రాజీనామా చేయాలన్నది ఒక్కటే ఆలోచన. గెలుపోటములపై ఆలోచనే లేదు. నైతిక విలువలకు కట్టుబడి ఉండాలన్నదే సిద్దాంతం. అందుకే ఇటు రేవంత్ అయినా, అటు శిల్పా చక్రపాణి రెడ్డి అయినా ఎంఎల్ఏ, ఎంఎల్సీ పదవులకు రాజీనామాలు చేసి కాగితాలు విసిరికొట్టారు.
తెలంగాణాలో ఎంఎల్ఏ పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేసిన తర్వాత నైతిక విలువలపై చర్చలు మళ్ళీ మొదలయ్యాయి. గెలుస్తామో లేదో వేరే విషయం అనుకున్న రేవంత్ రెడ్డి ఎంఎల్ఏకి రాజీనామా చేసాడు. దాంతొ ఏపిలో ఫిరాయింపుల వ్యవహారంపై చర్చ మొదలైంది. చంద్రబాబునాయుడి ప్రలోభాలకు గురయ్యే వైసీపీ ఎంఎల్ఏ, ఎంపిలు టిడిపిలోకి ఫిరాయించారన్న విషయం అందరికీ తెలిసిందే. ఒకసారి పార్టీ మారాలనుకున్న తర్వాత అప్పటి వరకూ పార్టీ ద్వారా తమకు సంక్రమించిన అన్నీ పదవులకూ రాజీనామాలు చేయటమన్నది కనీస నైతికత.
మరి ఏపిలో జరిగేందేమిటి ? పార్టీ ఫిరాయించిన వారు రాజీనామాల ఊసెత్తటం లేదు. ప్రలోభాలకు గురిచేసిన వారూ రాజీనామాల గురించి మాట్లాడటం లేదు. మరి తెలంగాణాలో అదే పార్టీకి చెందిన రేవంత్ మాత్రం పార్టీతో పాటు ఎంఎల్ఏ పదవికి కూడా రాజీనామా ఎందుకు చేసినట్లు? అంటే, ఇక్కడ మ్యాటర్ వెరీ క్లియర్. వైసీపీ నుండి టిడిపిలోకి ఫిరాయించిన వారికి, ప్రలోభాలు పెట్టిన వారికి కూడా ఫిరాయింపుల గెలుపుపై బోల్డన్ని అనుమానాలున్నాయ్.
అంతేకాకుండా తమను నమ్మి గెలిపించన వారికి సమాధానం చెప్పాలని ఇంగిత జ్ఞానం కూడా ఫిరాయింపులకు లేకపోవటం. మరి రేవంత్ మాత్రం డిఫరెంట్ గా ఎందుకు ఆలోచించారు? అంటే, నైతికత విలువలు పాటించాలని అనుకోవటంతో పాటు ఉపఎన్నికల్లో గెలుపుపై నమ్మకం ఉండటమే. చంద్రబాబుతో పాటు ఫిరాయింపుల్లో పై రెండు లోపించాయన్నది స్పష్టంగా తెలిసిపోతోంది.
రేవంత్ మాత్రమే కాదు. నంద్యాల ఉపఎన్నికలో వైసీపీ తరపున పోటీ చేసిన శిల్పా మోహన్ రెడ్డి సోదరుడు శిల్పా చక్రపాణి రెడ్డి కూడా తన ఎంఎల్సీ పదవికి రాజీనామా చేసారు. అప్పటికి చక్రపాణి ఎంఎల్సీ అయ్యింది కూడా కేవలం మూడు మాసాలు మాత్రమే.
అంటే 6 సంవత్సరాల పదవీ కాలాన్ని కూడా చక్రపాణి వద్దనుకున్నారు. అందులోనూ వైసీపీలోకి చేరాలంటే టిడిపి ద్వారా సంక్రమించిన ఎంఎల్సీకి పదవికి రాజీనామా చేయాల్సిందే అని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా స్పష్టంగా చెప్పారు. రేవంత్, చక్రపాణి రెడ్డికున్న ఆపాటి జ్ఞానం, గెలుపుపై నమ్మకం కూడా టిడిపి ఫిరాయింపు ఎంఎల్ఏలు, ఎంపిలతో పాటు చంద్రబాబుకు లేకపోవటమే ఆశ్చర్యంగా ఉంది. పైగా ఇక్కడో విచిత్రాన్ని గమనించాలి. రేవంత్ ప్రతిపక్షంలో నుండి మరో ప్రతిపక్షంలోకి వెళుతున్నారు. చక్రపాణి రెడ్డి అధికారపార్టీలో నుండి ప్రతిపక్షంలొకి వెళ్ళారు.