
రెండు రోజుల క్రితం ఆనందయ్య ఆయుర్వేద మందుతో ఆక్సిజన్ లెవల్స్ పెరిగాయన్న రిటైర్డ్ హెడ్‌మాస్టర్ కోటయ్య ఆరోగ్యం మళ్లీ క్షీణించింది. శనివారం ఒక్కసారిగా ఆక్సిజన్ లెవల్స్ తగ్గడంతో కోటయ్యను కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. కాగా, కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందు పంపిణీకి వారం పాటు బ్రేక్ పడింది.
కరోనా మందుపై ఆయుష్ కమిషనర్ రాములు ఆధ్వర్యంలో అధ్యయనం కొనసాగుతోంది. శనివారం ఉదయం ఆయుర్వేద నిపుణుడు ఆనందయ్య నివాసానికి చేరుకున్న పోలీసులు.. ఆయుర్వేద మందు పంపిణీ కేంద్రాన్ని ఖాళీ చేయించి, పంపిణీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు కృష్ణపట్నానికి ఐసీఎంఆర్ బృందం రానుంది.
కాగా, బొనిగె ఆనందయ్య ఇస్తున్న కరోనా మందుపై ఆయుష్ కమిషనర్ రాములు శుభవార్త చెప్పారు. మందు తయారీలో వాడే పదార్థాలన్నీ శాస్త్రీయంగానే ఉన్నాయని, మందు తయారీ పదార్థాలపై ల్యాబ్ నుంచి పాజిటివ్ నివేదిక వచ్చిందని ఆయన చెప్పారు.
Also Read:అనందయ్యని జాతీయ నిధిగా గుర్తించి సైనిక సెక్యూరిటీ కల్పించాలిః రామ్‌గోపాల్ వర్మ ట్వీట్లు
ఆనందయ్య మందు ఎలా తయారు చేస్తున్నారో పరిశీలిస్తామని రాములు చెప్పారు. ఆనందయ్య కరోనా మందుపై రాములు ఆధ్వర్యంలోనే అధ్యయనం జరుగుతోంది. రాములు ఎదుట ఆనందయ్య ఆయుర్వేద మందు తయారీని చూపిస్తారు. ఈ సందర్భంగా రాములు మీడియాతో మాట్లాడారు.
శుక్రవారంనాడు ముత్తుకూరులో కొంత మందితోనూ ఆనందయ్య వద్ద పనిచేసేవారితోనూ మాట్లాడామని ఆయన చెప్పారు. ఆనందయ్య వద్ద మందు తీసుకున్నవారి అభిప్రాయాలు కూడా తీసుకుంటామని ఆయన చెప్పారు. ఐసిఎంఆర్ పరిశీలన తర్వాత వారితో కూడా సమన్వయం చేసుకుంటామని ఆయన చెప్పారు.మందు తయారీ అధ్యయనం తర్వాత నివేదికకు వారంపైనే పడుతుందని రాములు చెప్పారు.
ఆనందయ్య కరోనా మందుకు ప్రజల నుంచి రెస్పాన్స్ రావడంతో నకిలీ రాయుళ్లు పుట్టుకొచ్చారు. ఆనందయ్య కరోనా మందు పేరుతో బ్లాక్‌మార్కెట్‌లో విక్రయాలు జరుపుతున్నారు. ప్రజల అవసరాన్ని క్యాష్ చేసుకుంటున్నారు.