టిడిపి ఎంఎల్ఏ అనుచరులు ఎంత పనిచేశారో ?

First Published Feb 20, 2018, 11:39 AM IST
Highlights
  • తెలుగుదేశంపార్టీ నేతల ఆగడాలకు అంతులేకుండా పోతోంది.

తెలుగుదేశంపార్టీ నేతల ఆగడాలకు అంతులేకుండా పోతోంది. అధికారం చేతిలో ఉందికదా అన్న అహంకారంతో ఎవరిని పడితే వారిని చితకబాదేస్తున్నారు. తాజాగా అనంతపురం జిల్లా ధర్మవరంలో అదే జరిగింది. ఇంతకీ విషయం ఏమిటంటే, నవోదయ కాలనీకి చెందిన నారాయణస్వామి సోమవారం రాత్రి ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తున్నాడు. విద్యుత్ నగర్ సర్కిల్ నుంచి ఎమ్మెల్యే వరదాపురం సూర్యనారాయణ రెడ్డి ఇంటి సమీపంలో ఎమ్మెల్యే అనుచరులు వేగంగా బైక్‌పై నారాయణ స్వామిని ఓవర్ టేక్ చేశారు. అయితే, వారు రోడ్డంతా తమ వాహనాలతో ఆక్రమించేశారు. దాంతో నారాయణస్వామి అదే పనిగా హారన్ ఇచ్చారు.

తమ వాహనాలనే తప్పుకోమంటూ పదే పదే హారన్ ఇచ్చారన్న కారణంతో నలుగురు యువకులు తమ బైకులను రోడ్డుపైనే నిలిపేసి గొడవ పెట్టుకున్నారు. మాటమాట పెరిగి నారాయణస్వామిని చితకబాదారు. తనను వదిలేయాలని నారాయణస్వామి కాళ్లు పట్టుకుని వేడుకున్నా వినకుండా తీవ్రంగా కొట్టారు.

దెబ్బలుతిన్న నారాయణస్వామి హౌసింగ్ బోర్డుకు వెళ్లి తన బంధువు అయిన రాజశేఖర్‌కు సమాచారం అందించాడు. దాంతో రాజశేఖర్ చిరంజీవి, అనిల్ కుమార్‌ లను వెంట తీసుకుని అనుచరులపై ఎంఎల్ఏకి ఫిర్యాదు చేద్దామని సూరి ఇంటికి వెళ్ళారు. నారాయణస్వామిని తీవ్రంగా కొట్టిన వారు అక్కడే కనిపించటంతో ఎందుకు కొట్టారంటూ రాజశేఖర్ ప్రశ్నించారు.  దాంతో మరింత రెచ్చిపోయిన ఎమ్మెల్యే అనుచరులు వారిని కూడా చితకబాదారు.

అంతేకాకుండా వారి మెడలోని గొలుసు, బ్రాస్‌లెట్‌ను లాగేసుకున్నారు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ నారాయణస్వామి, రాజశేఖర్‌లను చికిత్స నిమిత్తం 108లో ఆస్పత్రికి తరలించారు. రాజశేఖర్‌కు తలపై ఎనిమిది కుట్లు పడ్డాయి. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.   

click me!