టీడీపీ నేత గౌతు శిరీషకు ఊరట.. సీఐడీ నోటీసులపై ఏపీ హైకోర్టు స్టే

Siva Kodati |  
Published : Jun 16, 2022, 04:06 PM IST
టీడీపీ నేత గౌతు శిరీషకు ఊరట.. సీఐడీ నోటీసులపై ఏపీ హైకోర్టు స్టే

సారాంశం

టీడీపీ నేత గౌతు శిరీషకు సీఐడీ నోటీసులపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. అనంతరం రెండు వారాల పాటు విచారణను వాయిదా వేసింది న్యాయస్థానం. దీంతో శిరీషకు ఊరట కలిగినట్లయ్యింది.   

సీఐడీ నోటీసులకు సంబంధించి టీడీపీ నేత గౌతు శిరీష (Gouthu Sireesha)కు ఏపీ హైకోర్టులో గురువారం ఊరట లభించింది. ఆమెకు ఇచ్చిన నోటీసులపై న్యాయస్థానం స్టే విధించింది. సీఐడీ ఇచ్చిన నోటీసుల్ని హైకోర్టులో (ap high court) సవాల్ చేస్తూ శిరీష పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవల విచారణకు వెళ్లిన సమయంలో కనీసం భోజనం కూడా పెట్టకుండా.. తన మొబైల్ తీసుకుని సీఐడీ (ap cid) అధికారులు తనను ఇబ్బంది పెట్టారని శిరీష తరపు లాయర్ వాదనలు వినిపించారు. అంతేకాకుండా సీఐడీ ఇప్పటి వరకూ ఎఫ్‌ఐఆర్‌ కూడా ఇవ్వలేదని.. మహిళల పట్ల ఇలా వ్యవహరించడం సరికాదన్నారు. ఈ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం .. సీఐడీ ఇచ్చిన నోటీసులపై స్టే ఇస్తూ కేసు విచారణను మరో రెండు వారాలకు వాయిదా వేసింది.

కాగా.. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారానికి పాల్పడ్డారనే అభియోగాలతో గౌతు శిరీషకు సీఐడీ నోటీసులు ఇచ్చారు. అమ్మ ఒడి, వాహనమిత్ర పథకాలను రద్దు చేశారంటూ ఓ ఫేక్ నోట్‌ను శిరీష సోషల్ మీడియాలో పోస్టు చేశారనే కారణంతో సీఆర్‌పీసీలోని (crpc) సెక్షన్‌ 41 ఏ కింద ఈ నోటీసులు ఇచ్చారు. దీనికి సంబంధించి ఆమె సీఐడీ విచారణకు కూడా హాజరయ్యారు. విచారణ సమయంలో తాను ఈ నేరం చేసినట్లు ఒప్పుకోవాలని సీఐడీ అధికారులు ఒత్తిడి చేశారని శిరీష ఆరోపించారు. తనపై పెట్టిన పోలీసు కేసులను న్యాయపరంగా ఎదుర్కొంటానని ఆమె స్పష్టం చేశారు. సీఐడీ జారీ చేసిన ఈ నోటీసులను ఆమె హైకోర్టులో సవాల్ చేశారు. ఇప్పటికే ఓసారి సీఐడీ ప్రధాన కార్యాలయంలో గౌతు శిరీష విచారణకు వెళ్లారు. ఈ నెలలో మరోసారి విచారణకు రావాలని సీఐడీ నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో ఇప్పుడు శిరీషకు హైకోర్టులో ఊరట లభించింది.

PREV
click me!

Recommended Stories

AP Food Commission Chairman: అధికారులకు చుక్కలు చూపించిన ఫుడ్ కమీషన్ చైర్మన్| Asianet News Telugu
Ayodhya Temple: కొత్త సంవత్సరం సందర్బంగా అయోధ్యలో పోటెత్తిన భక్తులు | Asianet News Telugu