అక్రమాస్తుల కేసులో జగన్ కు ఊరట

First Published Feb 2, 2018, 12:18 PM IST
Highlights
  • జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులపై సిబిఐ కోర్టుల్లో విచారణ జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే.

జగన్ అక్రమాస్తుల కేసుల నుండి మరో అధికారికి ఊరట లభించింది. ఎటువంటి ఆధారాలు లేకుండానే ఉన్నతాధికారిపై కేసు పెట్టారని ఎన్పోర్స్ మెంట్ డైరెక్టరేట్ పై కోర్టు మండిపడింది. ఇంతకీ విషయం ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులపై సిబిఐ కోర్టుల్లో విచారణ జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే, పలు కేసుల్లో ఉన్నతాధికారులపై మోపిన కేసులను కోర్టు కొట్టేస్తున్నది. ఎందుకంటే, ఐఏఎస్ అధికారులపై మోపిన అభియోగాల్లో ఒక్కదానికీ ఇటు సిబిఐ కానీ అటు ఈడి కానీ ఏ విధమైన సాక్ష్యాధారాలను చూపించలేకపోతోంది.

అందుకనే, జగన్ పై ఉన్న కేసుల్లో నుండి ఒక్కో అధికారి బయటపడిపోతున్నారు. తాజాగా ఆదిత్యనాధ్ దాస్ విషయంలో కూడా అదే జరుగుతోంది. కాకపోతే కేసును పూర్తిగా కొట్టేయలేదు. అయితే దాస్ పెట్టిన కేసుల్లో సాక్ష్యాలను చూపటంలో ఈడి విఫలమైందని మాత్రం హైకోర్టు వ్యాఖ్యానించింది. నిబంధనలను అతిక్రమించి ఇండియా సిమెంట్స్ కు నీటి కేటాయింపులు జరిపారన్న ఆరోపణల్లో ఎక్కడా సాక్ష్యాలు లేవని కోర్టు అభిప్రాయపడింది. దాస్ పై తప్పుడు కేసు నమోదు చేసినందుకు ఇడికి కోర్టు నోటీసులు కూడా జారీచేసింది. అంతేకాకుండా కేసు విచారణ సమయంలో దాస్ కు వ్యక్తిగత హాజరు అవసరం లేదని మినహాయింపు కూడా ఇచ్చింది.

జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కేసుల విషయంలో జగన్ కు కూడా ఊరట లభించటం ఖాయమని తెలుస్తోంది. తండ్రి వైఎస్ హయాంలో జగన్ భారీగా అక్రమాలు చేశాడన్న ఆరోపణలపై సిబిఐ, ఈడీ కేసులు నమోదు చేసింది.

అయితే, జగన్ పై మోపిన కేసుల్లో ఇంత వరకూ ఒక్కటి కూడా నిరూపణ కాలేదు. ఎందుకంటే, ఐఏఎస్ అధికారుల ప్రమేయం లేకుండా, అప్పటి మంత్రులకు పాత్ర లేకుండా జగన్ ఏ విధంగా అవినీతికి పాల్పడ్డాడు అన్నది పెద్ద ప్రశ్న. కాబట్టి చివరకు తనపై మోపిన అన్నీ కేసులను కొట్టేస్తారని జగన్ చెబుతున్నదే నిజమవుతుందేమో?  

click me!