
మాజీ మంత్రి, టీడీపీ నాయకురాలు భూమా అఖిల ప్రియ (Bhuma Akhila Priya), ఆమె సోదరుడు భూమా విఖ్యాత్‌రెడ్డిలకు ఏపీ హైకోర్టులో (AP High Court) ఊరట లభించింది. ఆళ్లగడ్డ పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసులను కొట్టివేయాలంటూ అఖిల ప్రియ దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. అఖిలప్రియ తరఫున లాయర్ కృష్ణారెడ్డి వాదనలు వినిపించారు. ఎటువంటి కారణాలు లేకుండా రాజకీయ వేధింపులతోనే కేసు నమోదు చేశారని ఆయన కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న అనంతరం సెక్షన్ 41-ఏ ప్రకారం విచారణ జరపాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది.
ఇక, 2020 జూన్ 20వ తేదీ రాత్రి పడకండ్ల గ్రామం వద్ద ఓ రోడ్డు సమస్యకు సంబంధించి ఆళ్లగడ్డలో వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీ కార్యకర్తలు ఘర్షణకు దిగిన విషయం సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని వైసీపీ, టీడీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు. అయితే విఖ్యాత్ రెడ్డి తన అనుచరులతో కలిసి పోలీస్ స్టేషన్‌లోకి ప్రవేశించి టీడీపీ కార్యకర్తలను పోలీస్ స్టేషన్ నుంచి బలవంతంగా తీసుకెళ్లారని ఆరోపిస్తూ పోలీసులు కేసులు నమోదు చేశారు.
ఇక, తనపై, తన సోదరుడిపై కేసుల నమోదు చేయడాన్ని సవాలు చేస్తూ అఖిలప్రియ హైకోర్టును ఆశ్రయించారు. ఎలాంటి సరైన కారణాలు లేకుండా.. రాజకీయ కారణాలతో తమను వేధించే లక్ష్యంతో ఈ కేసులు బుక్ చేశారని అఖిల ప్రియ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో కోర్టు ఆ సెక్షన్లన్నింటినీ తొలగించి సెక్షన్ 41-ఏ ప్రకారం విచారణ చేపట్టాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఇక, గత కొంతకాలంగా అఖిలప్రియ కుటుంబం తరుచూ వివాదాల్లో నిలిస్తున్న సంగతి తెలిసిందే.