
అనంతపురం జిల్లా గుత్తి వద్ద నిజామాబాద్-తిరుపతి రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో భారీ దోపిడీ ఘటన జరిగింది. సోమవారం అర్ధరాత్రి దాటాక, సుమారు 1.30 గంటల సమయంలో ఐదుగురు దుండగులు రైలులోకి చొరబడి బీభత్సం సృష్టించారు. రైలును గుత్తి శివారులో నిలిపిన సమయంలో అమరావతి ఎక్స్‌ప్రెస్‌కు లైన్ క్లియర్ చేయడం కోసం రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ను ఆపడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.
దుండగులు 10 బోగీల్లోకి చొరబడి ప్రయాణికులకు చెందిన బంగారం, నగదు, మొబైల్ ఫోన్లు, ఇతర విలువైన వస్తువులను అపహరించారు. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దోపిడీ తర్వాత దుండగులు పరారయ్యారు. మొత్తం 20 మంది బాధితులు తిరుపతి రైల్వే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గుత్తి రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరా ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. రాయలసీమ ఎక్స్ ప్రెస్ తెలంగాణలోని నిజామాబాద్ లో మొదలై కామారెడ్డి, లింగంపల్లి, సికింద్రాబాద్, గుత్తి మీదుగా తిరుపతి వెళ్తుంది.