
అనంతపురం: మాజీ మంత్రి పరిటాల సునీత.. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ రాప్తాడు ఎమ్మెల్యేపై నేరపూరిత ఆరోపణలు చేశారు. శ్రీరాములయ్య సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు కారు బాంబు పెట్టించింది మీరు కాదా? అంటూ ప్రశ్నించారు. 26 మందిని పొట్టన పెట్టుకోవడంలో ప్రస్తుత ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి కూడా భాగస్తుడని ఆరోపించారు. రాప్తాడు ఎమ్మెల్యే మా చరిత్ర వదిలి.. ఆయన సొంత చరిత్ర ఒకసారి తిరగేయడం మంచిది అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.
ప్రకాష్ రెడ్డి అవినీతి వెల్లడించడానికి ప్రత్యేకంగా ఒక సినిమా తీయాల్సి వస్తుందని, ఆయన చేసిన అవినీతిపై సినిమా తీసేరోజు దగ్గరలోనే ఉన్నదని పరిటాల సునీత పేర్కొన్నారు. ఆయన తమ కుటుంబాన్ని విమర్శించడం మానేసి.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ప్రాజెక్టులు పూర్తి చేసి చూపించాలని సవాల్ విసిరారు. ముఖ్యంగా మాజీ మంత్రి పరిటాల రవి గురించి మాట్లాడితే సహించబోరని స్పష్టం చేశారు.
అనంతపురం నియోజకవర్గంలో పరిటాల సునీత కుటుంబానికి మంచి పట్టు ఉన్నది. కానీ, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె పోటీ చేయకుండా తన కుమారుడు పరిటాల శ్రీరామ్‌ను బరిలోకి దింపారు. కానీ, ఆయన సుమారు 25 వేల ఓట్ల తేడాతో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై ఓటమి పాలయ్యారు. దీంతో రానున్న అసెంబ్లీ ఎన్నికలపై పరిటాల సునీత కాన్సంట్రేషన్ పెంచినట్టు తెలుస్తున్నది. ఈ క్రమంలోనే ఆమె స్థానిక ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై పదునైన ఆరోపణలు చేస్తున్నారు. కొన్నాళ్లుగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, పరిటాల సునీత మధ్య ఇటీవలే ఆరోపణలు, ప్రత్యారోపణలు తీవ్రమైన సంగతి తెలిసిందే.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీరామ్‌ను ధర్మవరం నియోజకవర్గం నుంచి బరిలోకి దింపాలని పరిటాల సునీత భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ నెలలో పరిటాల శ్రీరామ్ సంచలన ప్రకటన చేశారు. ధర్మవరం టీడీపీ టికెట్ ను గోనుగుంట్ల సూర్యనారాయణ (సూరి) కి ఇస్తే.. శాశ్వతంగా రాజకీయాలకు దూరమవుతానని సంచలన ప్రకటించారు. ధర్మవరంలో టీడీపీలోకి ఎవరు వచ్చినా? నేనే కండువా వేస్తానని శ్రీరామ్ అన్నారు. పార్టీ అభివృద్దికి కష్టపడుతున్నాని .. పార్టీ కూడా కష్టపడి పని చేస్తేనే సీటు ఇస్తోందని భావిస్తున్నని అన్నారు. అయితే.. నేను చంద్రబాబుకి చెప్పేది ఒక్కటేననీ, కాదు కూడదు అని నాకు కాకుండా వేరే వారికి టీడీపీ తరఫున టికెట్ ఇస్తే.. రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని హెచ్చరించారు.
మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణను ఉద్దేశించి పరోక్షంగా పరిటాల శ్రీరామ్ సంచనల వ్యాఖ్యలు చేశారు. ఇక టీపీడీ అధికారంలోకి వస్తే.. విదేశాల్లో దాక్కున్నా వైసీపీ నాయకులను బయటకు లాక్కొస్తామన్నారు. టీడీపీ సభలకు వస్తున్న ప్రజలను వాలంటీర్లు ఇబ్బందులు పెడుతున్నారని, ఇది మంచిది కాదని వాలంటీర్లకు కూడా పరిటాల శ్రీరామ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మొన్నటి వరకు రాప్తాడుకే పరిమితమైన పరిటాల శ్రీరాం.. ఇప్పుడిప్పుడే ధర్మవరం పై ఫోకస్ చేస్తున్నాడు. క్రమంగా కార్యక్రమాలు చేస్తూ.. ప్రజలను దగ్గరవుతున్నారు.