చంద్రబాబు, జగన్ లపై పోటీకి నేను రెడీ : బైరెడ్డి

By Nagaraju TFirst Published Dec 24, 2018, 2:29 PM IST
Highlights

తాజా రాజకీయాలపై మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కర్నూలు జిల్లా ఆత్మకూరు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. 
 

కర్నూలు: తాజా రాజకీయాలపై మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కర్నూలు జిల్లా ఆత్మకూరు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. 

మరోవైపు తన పోటీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధిష్టానం ఆదేశిస్తే తాను సీఎం చంద్రబాబుపై కుప్పం నుంచి అయినా పోటీకి రెడీ అన్నారు. లేకపోతే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై పులివెందుల నుంచి అయినా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. 

టీడీపీతో పొత్తు వల్లే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాకూటమి ఓటమి చెందిందని బైరెడ్డి ఆరోపించారు. తెలంగాణలో టీడీపీతో కలిసి కాంగ్రెస్‌ పోటీ చేయడాన్ని అక్కడి ప్రజలు వ్యతిరేకించారని తెలిపారు. 

ఏపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఒంటరిగానే అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. తమ పార్టీ ప్రవేశపెట్టబోయే పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు విస్తృతంగా ప్రచారం చేస్తానన్నారు. త్వరలోనే పార్టీ తరుపున జిల్లా వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టనున్నట్లు చెప్పుకొచ్చారు. బస్సుయాత్ర శ్రీశైలం నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపారు. 

ముఖ్యంగా రైతులకు రూ.2లక్షల రుణమాఫీ, చౌక దుకాణాల్లో సోనా మసూరీ బియ్యం పంపిణీ, మూడు నెలలకు ఓ గ్యాస్‌ సిలిండర్‌ ఉచితంగా ఇవ్వడం, వృద్ధులకు పెన్షన్లను పెంచడం వంటి పథకాల వల్ల రాష్ట్ర ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని బైరెడ్డి అభిప్రాయపడ్డారు. 

నోట్లరద్దు, జీఎస్టీ అమలు వంటి ప్రజావ్యతిరేక నిర్ణయాలతో మోదీ నియంతలా వ్యవహరిస్తున్నట్లు బైరెడ్డి ఆరోపించారు. మరోవైపు చంద్రబాబు నాయుడుపైనా విరుచుకుపడ్డారు.  చంద్రన్న క్రిస్మస్‌ కానుకల పేరిట దళిత ప్రజలకు చేరువయ్యేందుకు చంద్రబాబు చేస్తున్న కుయుక్తులను ఎవరూ నమ్మరని ధ్వజమెత్తారు. 

తమ పార్టీ అధికారంలోకి వస్తే సిద్దేశ్వరం అలుగు, గుండ్రేవుల నిర్మాణాలతో పాటు మంత్రాలయం నుంచి కొత్తపల్లి మండలం వరకు తుంగభద్ర జలాలను వినియోగించుకునేందుకు వీలుగా గ్రావిటీ మీదుగా కాల్వను నిర్మిస్తామని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి హామీ ఇచ్చారు. 

click me!