రెయిన్‌ ఎఫెక్ట్‌: ఏపీలో ఆ గ్రామాల్లో పడవలతో రాకపోకలు

ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తుండటంతో వశిష్ట, గోదావరి నదుల పరిసర గ్రామాలకు వరద పోటెత్తింది. దాంతో ఆయా ప్రాంతాల్లో పడవల ద్వారా ప్రజలు రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.


ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ప్రధానంగా ఎగువన తెలంగాణ కురిసన వానలతో గోదావరి నదికి వరద పోటెత్తుతోంది. దీనికి తోడు ఏపీలో కురిసిన వర్షాలకు నది మరింత ఉదృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఉమ్మడి గోదావరి జిల్లాల్లోని పలు లంక గ్రామాలు జల దిగ్బంధంలోకి వెళ్లిపోయాయి. కాగా, ఇప్పటికే ఆయా జిల్లాల అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

కాగా, అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం బూరుగులంక రేవులో లంక గ్రామాల ప్రజల రాకపోకల కోసం వశిష్ట నదిపాయలో తాత్కాలికంగా నిర్మించిన రహదారి గురువారం వరద నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది. ఇది నది పాయలో ఇసుక, మట్టితో ఏర్పాటుచేసిన రహదారి. ప్రతి సంవత్సరం ధవళేశ్వరం బ్యారేజీ నుంచి లక్ష క్యూసెక్కుల వరద నీరు కిందకి విడుదల చేసినప్పుడు ఆ తాత్కాలిక రహదారి కొట్టుకుపోవడం సర్వసాధారణమని అధికారులు చెబుతున్నారు. ఇలా ప్రతి సంవత్సరం వరదలు వచ్చినప్పుడు ఉడిమూడి లంక, జి.పెదపూడి లంక, అరిగెలవారి పేట, బూరుగులంక గ్రామాల ప్రజలు రాకపోకలు ఇబ్బందులు ఎదర్కొంటున్నారు. వరదల సీజన్ తగ్గేవరకు పడవలపైనే రాకపోకలు సాగిస్తుంటారు. ఈ సమస్యను పరిష్కరించడానికి వశిష్ట నదిపై నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులు వచ్చే ఏడాది నాటికి పూర్తి అవుతాయని అధికారులు చెబుతున్నారు. కాగా, ఈ నాలుగు లంక గ్రామాల్లో అధికారిక లెక్కల ప్రకారం 2,319 మంది ప్రజలు నివసిస్తున్నారు.

Latest Videos

గురువారం వరద నీటి ప్రవాహానికి బురుగులంక రేవులో ఏర్పాటు చేసిన తాత్కాలిక రహదారి కొట్టుకుపోయిన నేపథ్యంలో... కొన్ని సామాజిక మాధ్యమాలు, ఎలక్ట్రానిక్ మీడియాలలో గోదావరి నదికి గండి పడిందని కథనాలు ప్రచురితమవుతున్నాయి. ఈ కథనాల్లో ఎంత మాత్రం వాస్తవం లేదని అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. కేవలం నది పాయలో ఏర్పాటుచేసిన తాత్కాలిక రహదారి మాత్రమే కొట్టుకుపోయిందని, గోదావరి నది గట్టుకు ఎటువంటి గండి పడలేదని స్పష్టం చేశారు.

తాత్కాలిక రహదారి కొట్టుకుపోవడంతో ఈ నాలుగు లంక గ్రామాల్లో నివసించే  ప్రజల రాకపోకలకు 4 మెకనైజ్డ్ పడవలు, లైఫ్ జాకెట్లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ తెలిపారు. ప్రజల భద్రతకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. సామాజిక మాధ్యమాలు, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచురితమవుతున్న వార్తలను చూసి భయభ్రాంతులకు గురికావద్దని ప్రజలకు జిల్లా కలెక్టర్ సూచించారు.

click me!