విశాఖ రైల్వే జోన్ః ప్రభూ వల్లా కాలేదు

First Published Feb 1, 2017, 10:00 AM IST
Highlights

రైల్వే శాఖ మంత్రే ఏపి నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి రాష్ట్రానికి ఇక ప్రాజెక్టులే ప్రాజెక్టులన్నట్లు కలరింగ్ ఇచ్చారు.

కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు వల్ల కూడా విశాఖపట్నం ప్రత్యేకరైల్వేజోన్ ఏర్పాటు సాధ్యం కాలేదు. సురేష్ ప్రభు స్వయంగా  రైల్వే శాఖ మంత్రి కూడా కావటంతో రాష్ట్రంలోని జనాలు బాగా ఆశలు పెట్టుకున్నారు. మహారాష్ట్రాకు చెందిన ప్రభును భారతీయ జనతా పార్టీ ఏపి నుండే రాజ్యసభకు నామినేట్ చేసింది. అందుకు టిడిపిని నిచ్చెనగా వాడుకున్నది. ఇద్దరు నాయుడ్ల మధ్య ఏమి చర్చలు జరిగిందో తెలీదు గానీ ప్రభు మాత్రం టిడిపి కోటాలో ఏపి నుండి రాజ్యసభకు ఎంపికయ్యారు.

 

ప్రభు ఎంపికైన సమయంలో నాయుడ్లు మాట్లాడుతూ స్వయంగా రైల్వే శాఖ మంత్రే ఏపి నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి రాష్ట్రానికి ఇక ప్రాజెక్టులే ప్రాజెక్టులన్నట్లు కలరింగ్ ఇచ్చారు. అదే విషయాన్ని జనాలు కూడా నిజమనుకున్నారు. ఎందుకంటే, అంతకుముందు వరకూ రైల్వేశాఖకు ఎవరు మంత్రిగా ఉంటే వారి రాష్ట్రాలకు చాలా ప్రాజెక్టులను కేటాయించుకున్నారు. అదే దారిలో ప్రభు కూడా ఏపికి ఏదో చేస్తారనుకున్నారు. అదేసమయంలో ప్రభు మహారాష్ట్రకు చెందిన నేత కాబట్టి ఆయన  సొంత రాష్ట్రానికే చేసుకుంటారని అన్నవాళ్ళూ ఉన్నారు లేండి.

 

చివరకు ఏవరేమనుకున్నా ఏపికి మాత్రం రైల్వే జోన్ ఏర్పాటు విషయంలో కేంద్రం మొండిచెయ్యే చూపించింది. అందుకు టిడిపి, భాజపా నేతలు ఇపుడు ఏమంటున్నారంటే, ఈసారి బడ్జెట్లో సాధారణ బడ్జెట్, రైల్వే బడ్జెట్ అన్నది ప్రత్యేకంగా లేవు కాబట్టే ప్రభు ప్రభావం కనబడలేదంటున్నారు. అదే రైల్వే బడ్జెట్ ప్రత్యేకంగా ఉండివుంటే విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేకరైల్వే జోన్ వచ్చేసేదే అన్నంత బిల్డప్ ఇస్తున్నారు.

click me!