రాజధాని రైతులకు శుభవార్తే

First Published Feb 1, 2017, 7:25 AM IST
Highlights

రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు క్యాపిటల్ గైన్స్ రద్దు చేస్తున్నట్లు కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు.

మొత్తానికి చంద్రబాబునాయుడు ఇచ్చిన అనేక హోమీల్లో ఒక్కటి నెరవేరింది. అమరావతి ప్రాంతంలో రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు క్యాపిటల్ గైన్స్ రద్దు చేస్తున్నట్లు కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. అదికూడా రాజధాని ప్రాంతంలో ప్రభుత్వానికి భూములిచ్చిన రైతులకు మాత్రమే సుమా. ఎందుకంటే, రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో ఐదు గ్రామాల్లోని పలువురు రైతులు భూములిచ్చేది లేదని న్యాయస్ధానాన్ని ఆశ్రయించారు. దాంతో సుమారు 8 వేల ఎకరాల సమీకరణ కోసం ప్రభుత్వం నానా అవస్తలూ పడుతున్నది.

 

అందుకే భూములిచ్చిన రైతులకు మాత్రమే క్యాపిటల్ గైన్స్ మినహాయింపు అంటూ ప్రత్యేకంగా ప్రస్తావించింది. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం గజాల చొప్పున నివాస, వాణిజ్య స్ధలాలను ఇస్తోంది. ఏదైనా అవసరాల కోసం సదరు స్ధలాలను రైతులు అమ్ముకోవచ్చు. అలా అమ్ముకోగా వచ్చిన సంపదపై పన్ను కట్టాల్సిన అవసరం లేదు. అది కూడా మొదటిసారి అమ్ముకున్న వారికి మాత్రమే వెసులుబాటు.  రాష్ట్రం ఏర్పాటైన 2014 నుండి క్యాపిటల్ గైన్స్ మినహాయింపు వర్తిస్తుంది.

 

రాజధాని నిర్మాణానికి శంకుస్ధాపన కోసం ప్రధానమంత్రి నరేంద్రమోడి అమరవాతికి వచ్చినపుడు చంద్రబాబు క్యాపిటల్ గైన్స్ మినహాయింపు ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేసారు. ఆ తర్వాత జైట్లీతో కూడా పలుమార్లు చంద్రబాబు ప్రస్తావించారు. చంద్రబాబు విజ్ఞప్తిని కేంద్రం పరిగణలోకి తీసుకున్న జైట్లీ ఎట్టకేలకు బడ్జెట్ ప్రసంగంలో క్యాపిటల్ గైన్స్ మినహాయింపుపై ప్రకటించారు.

click me!