
న్యూఢిల్లీ: విశాఖలో రైల్వేజోన్ ఏర్పాటు విషయమై కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ సోమవారం నాడు స్పందించారు. విభజన చట్టంలో విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని లేదన్నారు. కేవలం రైల్వేజోన్ ను ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలించాలని మాత్రమే ఉందని పీయూష్ గోయల్ గుర్తు చేశారు.
సోమవారం నాడు ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసే వారంతా విశాఖ రైల్వేజోన్ విషయమై విభజన చట్టంలో ఏముందనే విషయమై పరిశీలించాలని ఆయన సూచించారు. విభజన చట్టంలో ఉన్న అంశం ప్రకారంగా రైల్వే జోన్ విషయాన్ని తాము పరిశీలిస్తున్నట్టుగా ఆయన చెప్పారు.
గతంలో పార్లమెంట్ సమావేశాల్లో కూడ తాను ఇదే విషయాన్ని చెప్పానని పీయూష్ గోయల్ చెప్పారు. విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని స్థానికులు ఆందోళనలు చేస్తున్నారు. విభజన చట్టం ప్రకారంగా ఈ విషయమై తాము పరిశీలిస్తున్నామని ఏపీ బిజెపి నేతలు కూడ ఇటీవల కాలంలో చెబుతున్నారు. అయితే ఈ ప్రకటనలకు భిన్నంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ చేసిన ప్రకటన ఏపీ ప్రజలను నిరాశకు గురిచేసింది.