గుజరాత్ లో కాంగ్రెస్ కు వైఎస్ పథకాలే దిక్కా ?

First Published Dec 1, 2017, 3:43 PM IST
Highlights
  • గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ ‘ఉచిత’ పథకాలను అమలు చేయనున్నదా ?

గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ ‘ఉచిత’ పథకాలను అమలు చేయనున్నదా ? ఎన్నికల హామీలను చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. త్వరలో జరుగనున్న పోలింగ్ లో ఎలాగైనా సరే కాంగ్రెస్ ను అధికారంలోకి తేవాలని కాంగ్రెస్ యువరాజు రాహూల్ గాంధి కంకణం కట్టుకున్నట్లే కనిపిస్తోంది. అందుకనే గుజరాత్ రాష్ట్రంలో రాహూల్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. పనిలో పనిగా 2003 ఎన్నికల్లో ఏపిలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ ఉచిత హామీలనే గుజరాత్ లో రాహూల్ పఠిస్తున్నారు.

పట్టీదార్ సామాజికవర్గం ఆధిక్యత కలిగిన అమ్రోలీ జిల్లాలో రాహూల్ పర్యటిస్తూ, కాంగ్రెస్ గనుక అధికారంలోకి వస్తే ప్రభుత్వం ఏర్పాటు చేసిన పది రోజుల్లోనే రైతు రుణాలను మాఫీ చేస్తామంటూ హామీ ఇచ్చారు. అంతేనా, ప్రభుత్వ ఎయిడెడ్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్ధులందరికీ ఉచిత విద్య అందిస్తామన్నారు. అలాగే, ఇతర కళాశాలల్లో చదువుతున్న విద్యార్ధులకు కూడా మరో హమీ గుప్పించారు. అందేంటంటే, ప్రభుత్వేతర కళాశాలల్లో చదువుతున్న విద్యార్ధుల ఫీజుల్లో 80 శాతం తగ్గిస్తారట.

ప్రస్తుతం ఇంజనీరింగ్, మెడిసిన్ లాంటి విద్యను చదవించాలన్న కలలను నెరవేర్చుకోవాలంటే విద్యార్ధుల తల్లిదండ్రులు రూ. 15 లక్షలు ఖర్చు చేయాల్సి వస్తోందని వాపోయారు. పేద విద్యార్ధులకు ఉచిత విద్య, రైతు రుణమాఫీ, ఫీజు రీంఎబర్స్ మెంట్ లాంటి పథకాలను వైఎస్ 14 ఏళ్ళ క్రితమే ఏపిలో అమలు చేసిన సంగతి అందిరికీ గుర్తుండే ఉంటుంది. అప్పట్లో కాంగ్రెస్ అధిష్టానంలోనే వైఎస్ హామీలపై మిశ్రమ స్పందన ఉండేది. అటువంటిది 14 ఏళ్ళ తర్వాత అవే హామీలను కాంగ్రెస్ యువరాజు గుప్పిస్తుండటం గమనార్హం.  రాహూల్ వరస చూస్తుంటే ఒకవేళ గుజరాత్ ఎన్నికల్లో గనుక కాంగ్రెస్ అధికారంలోకి వస్తే భవిష్యత్తులో జరిగే ప్రతీ ఎన్నికలోనూ ఇవే హామీలను గుప్పించేట్లే కనబడుతున్నారు.

 

 

 

click me!