వైఎస్ మా నేతనే: జగన్ పై రఘువీరా సంచలన వ్యాఖ్యలు

By Nagaraju TFirst Published 24, Jan 2019, 3:59 PM IST
Highlights

ఓట్లను చీల్చడానికే టీడీపీతో కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకోవడం లేదంటూ వైసీపీ ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. తమ నాయకుడు వైఎస్ బొమ్మపెట్టుకొని తమపై ఆరోపణలా చేస్తారా అంటూ విరుచుకుపడ్డారు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టేది జగన్ పార్టీ అంటూ ధ్వజమెత్తారు. 

విజయవాడ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో వైసీపీ పోటీ చెయ్యకుండా టీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చినందుకు ఎంత సొమ్ము ముట్టిందో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. 

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇచ్చినందుకు జగన్ ఎంత తీసుకున్నారో స్పష్టం చెయ్యాలన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్‌పై వైసీపీ పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు. 

గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన ఓట్లను చీల్చడానికే టీడీపీతో కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకోవడం లేదంటూ వైసీపీ ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. తమ నాయకుడు వైఎస్ బొమ్మపెట్టుకొని తమపై ఆరోపణలా చేస్తారా అంటూ విరుచుకుపడ్డారు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టేది జగన్ పార్టీ అంటూ ధ్వజమెత్తారు. 

రాష్ట్రంలో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్‌ స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ పోటీ చేస్తుందని చెప్తే జగన్ తన పత్రికలో తప్పుడు కథనాలు రాయించారని విరుచుకుపడ్డారు. కేవలం ఓట్లు చీల్చేందుకే పోటీ అంటూ దిగజారుడు కథనాలు రాస్తున్నారని మండిపడ్డారు. తాము దిగజారుడు వ్యాఖ్యలు చేస్తే వైసీపీకి పుట్టగతులు ఉండవన్నారు. 

ఒక పిచ్చుక గువ్వలాంటి వైసీపీ కాంగ్రెస్‌ను విమర్శించే స్థాయి లేదన్నారు. హోదా ఇస్తామని చెప్పిన కాంగ్రెస్‌ను నమ్మని జగన్ ఇవ్వం పొమ్మని చెప్పిన బీజేపీతో దోస్తీ చేస్తున్నారని మండిపడ్డారు. ఏ పార్టీ మద్దతూ లేని కేసీఆర్‌ ప్రతిపాదించిన ఫెడరల్ ఫ్రంట్‌కు జగన్ ఎలా మద్దతు పలుకుతున్నారని రఘువీరారెడ్డి ప్రశ్నించారు. 

Last Updated 24, Jan 2019, 3:59 PM IST