లోకసభ స్పీకర్ తో రఘురామ కృష్ణమ రాజు కుటుంబ సభ్యుల భేటీ

By telugu teamFirst Published May 20, 2021, 2:14 PM IST
Highlights

సిఐడి చేతిలో అరెస్టయిన వైసీపి తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణమ రాజు కుటుంబ సభ్యులు లోకసభ స్పీకర్ ఓం బిర్లాను కలిశారు. ప్రభుత్వం రఘురామపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని వారు ఫిర్యాదు చేశారు.

న్యూఢిల్లీ: వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణమ రాజు కుటుంబ సభ్యులు లోకసభ స్పీకర్ ఓం బిర్లాను కలిశారు. రఘురామ భార్య రమాదేవి, కుమారుడు భరత్, కూతురు ఇందిరా ప్రియదర్శిని గురువారంనాడు ఓం బిర్లాను కలిసి ఏపీ సీఐడి చర్యలను, కోర్టు ధిక్కారాన్ని వివరించారు. 

రఘురామ కృష్ణమ రాజుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని వారు చెప్పారు. పార్లమెంటు సభ్యుడ్ని అరెస్టు చేసే ముందు లోకసభ స్పీకర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని, అయితే ఆ విధమైన అనుమతి తీసుకోకుండా రఘురామను అరెస్టు చేశారని వారు చెప్పారు. 

సీబిఐ కస్టడీలో రఘురామ కృష్ణమ రాజును చిత్రహింసలకు గురి చేశారని ఫిర్యాదు చేశారు. రఘురామ కృష్ణమ రాజుకు ప్రాణ హాని ఉందని అంటూ ఆ విషయంలో జోక్యం చేసుకోవాలని వారు స్పీకర్ ను కోరారు. ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసి నివేదికను తెప్పించుకుంటానని, చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలను తీసుకుంటానని ఆయన రఘురామ కుటుంబ సభ్యులకు చెప్పారు. 

ఇదిలావుంటే, వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణమ రాజు కుమారుడు భరత్, కూతురు ఇందు ప్రియదర్శిని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయం మరింత వేడెక్కినట్లు కనిపిస్తోంది. 

తన తండ్రిని ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం వేధిస్తోందని వారు అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. రఘురామ కృష్ణమ రాజుపై అక్రమ కేసులు పెట్టారని వారు చెప్పారు. తమ తండ్రి రఘురామను అరెస్టు చేయడం, ఆయనపై రాజద్రోహం కేసు నమోదు చేయడం వెనక కుట్ర ఉందని వారు ఆరోపించారు.

ఇదిలావుంటే, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రఘురామృష్ణమ రాజుకు సికింద్రాబాదులోని ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరీక్షల జరుగుతున్నాయి. గత రెండు రోజులుగా ఆయనకు వైద్య బృందం వైద్య పరీక్షలు నిర్వహించింది. వైద్య పరీక్షల నివేదికను తెలంగాణ హైకోర్టు ద్వారా సుప్రీంకోర్టుకు సీల్డ్ కవర్ లో సుప్రీం కోర్టుకు అందుతుంది.

మరోవైపు, రఘురామ కృష్ణమ రాజు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ రేపు శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఆ బెయిల్ పిటిషన్ మీద ఏపీ సిఐడి ఇప్పటికే కౌంటర్ దాఖలు చేసింది.  

click me!