రఘురామకే కాదు, కంగనాకు కూడా వై కెటగిరీ భద్రత: సుప్రీంలో దుష్యంత్ దవే

By telugu teamFirst Published May 21, 2021, 3:36 PM IST
Highlights

రఘురామ కృష్ణమ రాజుకే కాదు, సినీ నటి కంగనా రనౌత్ కు కూడా వై కెటగిరీ భద్రత ఉందని ఏపీ సిఐడి తరపు న్యాయవాది దుష్యంత్ దవే అన్నారు. మెరిట్స్ ఆధారంగా కేసును చూడాలని ఆయన వాదించారు.

న్యూఢిల్లీ: వైసిపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణమ రాజుకే కాదు, సినీ నటి కంగనా రనౌత్ కు కూడా వై కెటగిరీ భద్రత ఉందని ఏపీ సిఐడి తరపున న్యాయవాది దుష్యంత్ దవే అన్నారు. సుప్రీంకోర్టులో రఘురామ కృష్ణమ రాజు బెయిల్ పిటిషన్ మీద వాడివేడిగా వాదోపవాదాలు జరుగుతున్నాయి. తాము సికింద్రా బాద్ ఆర్మీ ఆస్పత్రి నివేదికను కాదడం లేదని దుష్యంత్ దవే అంటూ నివేదిక సంపూర్ణంగా లేదని అన్నారు. 

కొట్టడం వల్లనే రఘురామ కృష్ణమ రాజుకు గాయాలయ్యాయా, మరో కారణం వల్ల అయ్యాయా అనే స్పష్టత నివేదిక లేదని ఆయన అన్నారు. హైకోర్టు బెయిల్ పిటిషన్ ను తిరస్కరిస్తూ సెషన్స్ కోర్టుకు వెళ్లాలని సూచించిందని, ఇటువంటి స్థితిలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారని, అందువల్ల సుప్రీంకోర్టు ఈ విషయాన్ని చేపట్టడం సరి కాదని ఆయన అన్నారు. పిటిషన్ ను తిరస్కరించాలని ఆయన కోరారు.

సమాజంలో ఒకరినొకరు చంపుకోవాలన్నట్లుగా రఘురామ కృష్ణమ రాజు మాట్లాడారని, దాడి చేయాలని ప్రజలు ఓ ఎంపీ చెప్పవచ్చునా అని అన్నారు. మెరిట్స్ ఆధారంగా కేసును చూడాలని ఆయన సుప్రీంకోర్టును అభ్యర్థించారు. పిటిషన్ ను కొట్టేయాలని ఆయన కోరారు. జిజిహెచ్ నివేది, ఆర్మీ ఆస్పత్రి నివేదిక రెండూ సరైనవేనని ఉందని ఆయన అన్నారు. ఆర్మీ ఆస్పత్రిపై తమకు గౌరవం ఉందని, అయితే గుంటూరు నుంచి హైదరాబాదు తరలించే మధ్యలో ఏదో జరగిందని ఆయన అన్నారు. జీజీహెచ్ సమర్పించిన నివేదికలో గాయాలు ఎక్కడా కనిపించలేదని దవే అన్నారు. పోలీసులు ఓ ఎంపీని కొట్టడం జరగదని ఆయన అన్నారు. కొడితే పాదం రెండో వేలికి మాత్రమే గాయమయ్యేలా కొడుతారా అని ఆయన ప్రశ్నించారు.  రెండో సారి దుష్యంత్ దవేకు, రఘురామ కృష్ణమ రాజు తరఫు న్యాయవాది రోహత్గి వాగ్వివాదం జరిగింది. 

రఘురామ కృష్ణమ రాజుకు గాయాలు కాలేదు కాబట్టి పిటిషన్ ను తిరస్కరించాలని దవే కోరారు. ఇది సిబిఐకి అప్పగించాల్సిన కేసు కాదని ఆయన అన్నారు. గుంటూరు నుంచి హైదరాబాదుకు తరలించిన వీడియోను ఆయన ప్రదర్శించారు. రఘురామ కాలికి గాయమైనట్లు ఎక్కడా లేదని ఆయన అన్నారు. రఘురామ కండీషన్ బాగుందని ఆయన చెప్పారు. రోహత్గీ సిబిఐ విచారణ మాత్రమే కోరతున్నారు గానీ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని, రాష్ట్రానికి సైన్యాన్ని పంపించాలని కోరుతారేమోనని అన్నారు.

కాగా, వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణమ రాజు బెయిల్ పిటిషన్ మీద మధ్యాహ్నం తిరిగి విచారణ ప్రారంభమైంది. అధికార పార్టీని రఘురామ కృష్ణమ రాజు విమర్శిస్తున్నారు కాబట్టే కేసు పెట్టారని ఆయన తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ అన్నారు. రఘురామ విమర్శలు దేశద్రోహం కిందికి రాదని, అది బోగస్ కేసు అని రోహత్గీ అన్నారు. దానికి సిఐడి తరపు న్యాయవాది దుష్యంత్ దవే అడ్డు పడ్డారు. కేసుతో సంబంధం లేని విషయాలు ముందుకు తేవద్దని ఆయన అన్నారు. వైఎస్ జగన్ పేరు ప్రస్తావించడంతో దవే అడ్డుపడి జగన్ కక్షిదారుడు కాడని, అందువల్ల సంబంధం లేని విషయాలు ప్రస్తావించవద్దని అన్నారు.

దానికి రోహత్గీ స్పందిస్తూ తాను ఏం చెప్పదలుచుకున్నానో అది చెబుతున్నానని అన్నారు. ఈ సమయంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుని.. సీనియర్ న్యాయవాదులు ఘర్షణ పదవద్దని సూచించారు.  రఘురామ కృ్ణమ రాజు కాలి మునివేళ్లకు గాయాలు ఉన్నట్లు సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి నివేదికలో తేలింది. అంతేకాకుండా ఎడిమా ఉన్నట్లు కూడా నివేదిక తెలియజేసింది. 

ఇదిలావుంటే, వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణమ రాజుకు సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి నిర్వహించిన వైద్య పరీక్షల్లో సంచలన విషయాలు బయటపడినట్లు ఆర్థమవుతోంది. ఆర్మీ ఆస్పత్రి నివేదిక తమకు అందిందని సుప్రీంకోర్టు తెలిపింది. రఘురామ కృష్ణమ రాజు బెయిల్ పిటిషన్ మీద శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ సాగుతోంది. రఘురామ కాలి వేలికి ఫ్రాక్చర్ ఉన్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. 

తమకు ఎవరైనా ఒక్కటేనని సుప్రీంకోర్టు తెలిపింది రఘురామ గాయాలు తనకు తానే చేసుకున్నాడేమో తెలియదని సిఐడి వాదించింది. ఆర్మీ ఆస్పత్రి నివేదిక తమకు అందలేదని సిఐడి తెలిపింది. దీంతో ఆర్మీ ఆస్పత్రి నివేదికను సిఐడికి, పిటిషనర్లకు మెయిల్ చేస్తామని తెలిపింది. 

రఘురామ కృష్ణమ రాజు కాలి ఎముక విరిగిందని, ఇతర గాయాలు కూడా ఉన్నాయని సుప్రీంకోర్టు తెలిపింది. సిఐడి కస్టడీలో రఘురామ కృష్ణమ రాజును కొట్టారనేది వాస్తవమని తేలినట్లు రఘురామ తరఫు న్యాయవాది అన్నారు. ఎంపీ పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏమిటని న్యాయవాది ప్రశ్నించారు.  రఘురామ కృష్ణమ రాజు వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపించాలని ఆయన కోరారు. 

విచారణను మంగళవారానికి వాయిదా వేయాలని సిఐడి కోరింది. దానికి అభ్యంతరం తెలుపుతూ, ఈ రోజు విచారణ పూర్తి చేసి సిబిఐ విచారణకు ఆదేశించాలని రఘురామ తరఫు న్యాయవాది కోరారు.  రఘురామకు బెయిల్ మంజూరు చేయానలని కోరారు. విచారణ మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా పడింది.

click me!