అమరావతిపై జగన్ కు రఘురామ కృష్ణంరాజు లేఖ: మూడు రాజధానులపై విస్మయం

By telugu teamFirst Published Jun 21, 2021, 7:17 AM IST
Highlights

ఏపీ సీఎం వైఎస్ జగన్ కు వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణంరాజు లేఖల పరంపర కొనసాగిస్తున్నారు. తాజాగా ఆయన అమరావతిపై జగన్ కు లేఖ రాశారు. రాజధానిని తరలించడం సరైంది కాదని ఆయన అన్నారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణమరాజు లేఖల పరంపర కొనసాగుతోంది. నవ హామీలు - వైఫల్యాలు పేరుతో ఆయన ఇప్పటి వరకు తొమ్మిది లేఖలు రాశారు. నవ ప్రభుత్వ కర్తవ్యాలు పేరుతో మరో 9 లేఖలు రాస్తానని ఆయన చెప్పారు. తాజాగా రాసిన లేఖలో ఆయన రాజధానిగా అమరావతి కొనసాగింపు విషయాన్ని ప్రస్తావించారు. 

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రస్తుత సీఎం జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. పాదయాత్రలోనూ, ఎన్నికల ప్రచారంలోనూ జగన్ ఆ హామీ ఇచ్చారని రఘురామ కృష్ణం రాజు గుర్తు చేశారు. కనీసం 30 వేల ఎకరాల్లో రాజధాని ఉండాలని జగన్ సూచించారని ఆయన చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్ణయాన్ని మార్చుకోవడం సరైంది కాదని ఆయన అన్నారు. 

ప్రజలు ఇచ్చిన తీర్పును దుర్వియోగం చేయవద్దని ఆయన జగన్ కు సలహా ఇచ్చారు. మూడు రాజధానులపై సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం అందరినీ విస్మయానికి గురి చేసిందని ఆయన వ్యాఖ్యానించారు. అమరావతికి భవిష్యత్తు లేకుండా చేశారని ఆయన విమర్శించారు.

శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలు ఒకదానినొకటి అనుసంధానించి ఉంటాయని, ఈ మూడు వ్యవస్థలు ఒకే చోట ఉంటే ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గుతుందని ఆయన అన్నారు ప్రపంచ స్థాయి హరిత నగరంగా తీర్చిదిద్దాలని కోరుతూ రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతులు 550 రోజులుగా ఆందోళన చేస్తున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. 

click me!